West Bengal Assembly election 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరింది. ఏడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరకుంటున్నారు. చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు ముగియనున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఎన్నికలు జరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోని ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా.. ఏడవ విడత ఎన్నికలు మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్నాయి. ఇందులో మమతా బెనర్జీ ప్రస్తుత నియోజకవర్గం భవానిపూర్ కూడా ఉంది. మొత్తం 86 లక్షల మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కోవిడ్ పేషెంట్లు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు చేసింది.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్, వాపపక్ష కూటమి కూడా గట్టి పోటీనిస్తోంది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 2 న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్చువల్ ద్వారా మాట్లాడారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Also Read: