East Midnapore: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా జరుగుతున్నాయి. ఎనిమిది దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు మొదటిదశ పోలింగ్ జరుగుతోంది. ఇన్ని రోజులపాటు నాయకుల మాటల తూటాలతో వేడెక్కిన.. రాష్ట్రంలో ఈ రోజు ఒక ఫోన్ కాల్ సంభాషణ అలజడి సృష్టిస్తోంది. ఈ ఎన్నికల్లో తనకు సాయం చేయాలంటూ స్వయంగా తృణముల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ.. బీజేపీ నాయకుడికి ఫోన్ చేయడం కలకలం సృష్టిస్తోంది.
అయితే మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి టీఎంసీ మాజీ నేత.. ప్రస్తుత బీజేపీ నాయకుడైన సుబేందు అధికారికి నందిగ్రామ్ కంచుకోట. ఆయన ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అనంతరం మమతా ప్రస్తుత సిట్టింగ్ స్థానమైన భవానీపూర్‌ను కాదనుకొని నందిగ్రామ్‌లో పోటీచేస్తున్నారు. దీంతో నందిగ్రామ్‌లో ఇద్దరి మధ్య హోరాహోరి పోటీ నెలకొంది. ఈ క్రమంలో మమతా బెనర్జీ… నందిగ్రామ్‌లో అధికారికి అత్యంత సన్నిహితుడు, తమ్లుక్ ప్రాంత మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడైన ప్రలయ్ పాల్‌కు ఫొన్ చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ రికార్డింగ్‌ను టీవీ9 ధ్రువీకరించడం లేదు.
శనివారం ఉదయం మమతా బెనర్జీ తనకు ఫోన్ చేశారని.. నందిగ్రామ్‌లోని తనకు ప్రచారం చేయాలని కోరారని ప్రలయ్ పాల్ తెలిపారు. తనను మళ్లీ టీఎంసీలోకి రావాలని కోరారరని.. నందిగ్రామ్‌లో సుబేందు అధికారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని మమతా కోరినట్లు వెల్లడించారు. దీనికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. అధికారి కుటుంబంతో తనకు చాలాకాలంగా సంబంధం ఉందని.. భారతీయ జనతా పార్టీ కోసమే పని చేస్తానని తెలిపారు. బెంగాల్ వామపక్ష పాలనలో సీపీఎం నాయకులు నందిగ్రామ్ ప్రజలను, తమను హింసించేటప్పుడు అధికారి కుటుంబం అండగా నిలిచినట్లు వెల్లడించారు. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేయనని పేర్కొన్నట్లు ప్రలయ్ పాల్ తెలిపారు. నందిగ్రామ్ సీటులో సుబేందు అధికారి మాత్రమే గెలుస్తారని ప్రలయ్ పాల్ స్పష్టంచేశారు.
మమతా కాల్ రికార్డింగ్‌కు సంబంధించిన ఆడియో క్లిప్పులను బీజేపీ నాయకులు మొదటి దశ పోలింగ్ రోజున సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బెంగాల్ ఈ రికార్డింగ్ క్లిప్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఆడియో రికార్డింగ్‌ను ఇంతవరకూ ఎవరూ ధ్రువీకరించలేదు.
Also Read: