West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌లో రేపు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పలు పార్టీల ప్రధాన నేతలందరూ పదునైన మాటలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కాలుకు గాయం కావడంతో వీల్ చైర్‌లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఒంటి కాలుతోనే తాను బెంగాల్‌లో విజయం సాధిస్తానని.. భవిష్యత్తులో రెండు కాళ్లతో ఢిల్లీలో కూడా విజయం దక్కించుకుంటానని మమతా వ్యాఖ్యానించారు. సోమవారం బెంగాల్‌లోని హుగ్లీ దేబనందపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ బీజేపీ, ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను 8 విడతల్లో నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ మమత ఈసీని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్కువ వ్యవధిలో ఎన్నికలు ముగించలేరా అంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. బీజేపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే టీఎంసీ, సీపీఎం నేతలను చేర్చుకున్నారంటూ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో డబ్బులను పంచి గెలవాలని చూస్తున్నారని.. అందుకే నీళ్లలా డబ్బును వెదజల్లుతున్నారంటూ మండిపడ్డారు. అసలు సోనార్ బంగ్లా అంటూ మాటలు చెబుతున్న వాళ్లకు ఈ బెంగాల్‌ను పాలించే సత్తానే లేదని ఎద్దేవా చేశారు. వారంతా అబద్దాలు చెప్పడానికే వస్తున్నారంటూ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. రేపు పశ్చిమ బెంగాల్‌లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అధికారులు ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నారు.
Also Read: