Jaya Bachchan In Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ సారి అత్యధికమంది నటీనటులు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. టీఎంసీ, బీజేపీ నుంచి చాలా ప్రాంతాల్లో బంగ్లా స్టార్ నటులు పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, సినీనటి జయా బచ్చన్ తృణముల్ కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు సోమవారం కోల్‌కతా చేరుకున్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పొగడ్తల వర్షం కురిపించారు. అన్ని రకాల వేధింపులపై నిరాటంకంగా ఎదుర్కొంటూ.. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒంటరి మహిళ మమతా బెనర్జీయేనని పేర్కొన్నారు. అందుకే మమతా అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం ఉందంటూ జయా బచ్చన్ తెలిపారు. కోల్‌కతా వచ్చిన అనంతరం ఆమె టీఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
టీఎంసీకి మద్దతు ఇవ్వమని తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారని.. అందులో భాగంగానే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. మమతా అంటే తనకు ప్రేమ, గౌరవం ఉందన్నారు. ఎందుకంటే అన్ని రకాల వేధింపులపై ఆమె ఒంటరిగా పోరాడుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల సంగ్రామంలో మమతా బెనర్జీకి తల పగిలింది, కాలు విరిగింది. అయినా ఆమె పోరాడుతున్నారన్నారు. బెంగాల్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చి దిద్దాలన్న ఆమె సంకల్పాన్ని, ఆలోచనలను ఎవరూ అడ్డుకోలేకపోయారని జయా పేర్కొన్నారు. మమతా అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని జయా బచ్చన్ పేర్కొన్నారు.
అయితే.. జయా బచ్చన్ తృణమూల్ ఎమ్మెల్యే ఆరూప్ బిశ్వాస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆరూప్ బిశ్వాస్‌పై కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో పోటీ చేస్తున్నారు.
Also Read: