5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాల ముందస్తు ట్రెండ్ మెల్లగా వెల్లడవుతోంది . ఆదివారం లెక్కింపు కేంద్రాల్లో హడావుడి.. ఇక ఉదయం 8-8.30 గంటల సమయానికి బెంగాల్ లో సీఎం, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అతి ముఖ్యమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో లో దీదీ హవా మెల్లగా కనబడుతోంది. ఇక్కడ ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువెందు అధికారి పోటీ చేశారు. ఇక తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారమే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 17 సీట్లలో లీడింగ్ లో ఉంది. అన్నా డీఎంకే 12 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది. కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్ డీ ఎఫ్ ఆధిక్యంలో ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూడీ ఎఫ్ కూడా గట్టి పోటీనిస్తోంది. ఎల్ డీ ఎఫ్ నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అస్సాంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంది. ఇక్కడ బీజేపీ కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీనిచ్చిన ఫలితంగా ఓట్ల విషయంలో నువ్వా నేనా అన్నట్టు కౌంటింగ్ సాగుతోంది.