EC on Mamata: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈసీ షాక్.. ప్రచారంలో పాల్గొనకుండా 24గంటల పాటు నిషేధం..!

|

Apr 12, 2021 | 8:41 PM

పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది 24గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

EC on Mamata: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈసీ షాక్.. ప్రచారంలో పాల్గొనకుండా 24గంటల పాటు నిషేధం..!
Follow us on

Ban on Mamata Banerjee: తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది 24గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. సోమవారం రాత్రి 8 నుంచి 24 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత ప్రాతిపదికన మమతా బెనర్జీ ఓట్లు అడుగుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 3వ తేదీన హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌ ప్రాంతంలో మమతా బెనర్జీ పర్యటించారు. ఆ సమయంలో ఓ వర్గాన్ని ప్రస్తావించిన సీఎం మమతా బెనర్జీ.. కొన్ని పార్టీలు మైనారిటీ ఓటర్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి సమయంలో మైనారిటీ ఓటర్లందరూ ఏకం కావాలని మమత పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది.

దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. 48గంటల్లో వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులు జారీచేసింది. దీంతో స్పందించిన మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. మమతా సంజాయిషీని పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందని ఎన్నికల సంఘం.. ఈ చర్యలకు ఉపక్రమించింది. 24గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.



భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని బెంగాల్ సీఎం మమతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకుందని ఆమె విరుచుకుపడ్డారు. ఇందుకు నిరసనగా, మంగళవారం మధ్యాహ్నం 12 నుండి కోల్‌కతాలోని గాంధీ మూర్తి వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.


ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 8 దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగాయి. మిగిలిన 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 17న బెంగాల్‌లో ఐదో దశలో భాగంగా 44 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 8 దశల పోలింగ్ పూర్తి అయ్యాక మే నెల 2వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

Read Also… 

Sushil Chandra: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర.. రేపు బాధ్యతలు చేపట్టనున్న సీఈసీ