Attacks on Politicians: దాడుల తర్వాత కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం.. సానుభూతి వర్కౌట్ అయ్యేనా?

|

Mar 11, 2021 | 4:47 PM

మమతాబెనర్జీ ఎన్నికల ప్రచారంలో ఆమెపై దాడి నిజంగా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే.. ఎన్నికల ప్రచారంలో కావచ్చు.. సాధారణ పర్యటనల్లో కావచ్చు ప్రత్యర్థి పార్టీల క్యాడర్ పర్యటనకు వచ్చిన వారిపై దాడులకు యత్నించడం దేశంలో ఇదే మొదటి సారి కాదు.

Attacks on Politicians: దాడుల తర్వాత కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం.. సానుభూతి వర్కౌట్ అయ్యేనా?
Follow us on

Attacks on political leaders in the country: దేశంలో రాజకీయ నాయకులపై తిరగబడడం, వారిపై దాడులకు యత్నించడం కొత్తేమీ కాదు. గతంలోను ఇలాంటి ఉదంతాలు చాలానే జరిగాయి. ఇపుడు మమతాబెనర్జీ ఎన్నికల ప్రచారంలో ఆమెపై దాడి నిజంగా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే.. ఎన్నికల ప్రచారంలో కావచ్చు.. సాధారణ పర్యటనల్లో కావచ్చు ప్రత్యర్థి పార్టీల క్యాడర్ పర్యటనకు వచ్చిన వారిపై దాడులకు యత్నించడం దేశంలో ఇదే మొదటి సారి కాదు. ఇలాంటి ఉదంతాలు గతంలో ఎన్నో వున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలపైనే దాడులు జరిగిన సంఘటనలు చాలానే వున్నాయి. ఇలాంటి దాడులు కొందరికి కలిసి వస్తే.. మరికొందరి రాజకీయ జీవితాలనే మార్చేశాయి.

నితీష్ కుమార్ (బీహార్), జయలలిత (తమిళనాడు), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) లాంటి వారు తమపై దాడులు జరిగిన లేక దాడులకు యత్నాలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. చంద్రబాబు, అఖిలేష్ యాదవ్ లాంటి వారికి మాత్రం రివర్స్‌లో జరిగింది. తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైనా అలాంటి దాడినే జరిగినట్లు ఆమె చెప్పుకుంటున్నారు. తొలుత కాలికి చిన్న కట్టుతో కనిపించిన మమతాబెనర్జీ ఎన్నికల స్టంట్‌లో భాగంగా కాలికి పెద్ద కట్టుతో ఆసుపత్రి బెడ్‌ మీద వున్న ఫోటోలను తృణమూల్ కాంగ్రెస్ క్యాడర్ ప్రజల్లో సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు. తనపై నలుగురు దాడి చేశారని దీదీ చెబుతుంటే.. ఎవరు దాడి చేయలేదు. కారు డోర్ తగిలింది. ఎన్నికల ముందు మమత డ్రామా లాడుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ సహా వామపక్షాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో నాయకులపై దాడులు, చరిత్ర ఏం చెబుతుందో ఒక్కసారి చూద్దాం…

1989 మార్చి 25వ తేదీన తమిళనాడు మాజీ సీఎం జయలలితపై అసెంబ్లీలోనే దాడి జరిగింది. క‌రుణానిధి సీఎంగా వ్యవహరిస్తున్న కాలంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా.. రాష్ట్ర బడ్జెట్‌లో అన్నీ తప్పుడు గణాంకాలంటూ నిరసన వ్యక్తం చేశారు జయలలిత. దాంతో డిఎంకే సభ్యులు సీరియస్ అయ్యారు. వీరిలో కొందరు ఏకంగా జయలలితపైకి దూసుకువచ్చి, సభ సాక్షిగా దాడికి యత్నించారు. డిఎంకేకు చెందిన ఆనాటి మంత్రి దురై మురుగన్ అయితే ఏకంగా జయలలిత చీరను పట్టుకుని లాగేశారు. ఈ పెనుగులాటలో జయలలిత చీర చిరిగి పోగా.. చిరిగిన చీరతోనే ఆమె అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. సీఎం అయ్యాకనే సభకు వస్తానంటూ జయలలిత ఆనాడు ప్రతిన బూనారు. అన్నట్లుగానే 1991లో ముఖ్యమంత్రి అయ్యాకనే తిరిగి తమిళనాడు శాసనసభలో జయలలిత అడుగు పెట్టారు. 1991 ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని అన్నా డిఎంకే పార్టీ మొత్తం 234 సీట్లకు గాను ఏకంగా 225 సీట్లలో గెలుపొందింది. ఘన విజయం సాధించిన తర్వాతనే జయలలిత అసెంబ్లీలో కాలుమోపారు.

2003 అక్టోబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తిరుమల దారిలో అలిపిరి దాటిన తర్వాత నక్సల్స్ దాడి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతుండగా చంద్రబాబుపై నక్సల్ దాడి జరిగింది. అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ చంద్రబాబు టార్గెట్‌గా శక్తివంతమైన క్లైమోర్ మైన్ పేల్చారు. దాంతో చంద్రబాబు పయనిస్తున్న కాన్వాయ్‌లో పలు కార్లు ధ్వంసమయ్యాయి. అలిపిరి టోల్ గేటు దాటిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల 20 నిమిసాలకు చంద్రబాబుపై క్లైమోర్ మైన్ పేల్చారు. దాంతో చంద్రబాబు పయనిస్తున్న కారు పైకెగిరి ఓ రాయిపై పడింది. సంఘటనా స్థలంలో మరో రెండు బాంబులను పోలీసులు కనుగొని నిర్వీర్యం చేశారు. గాయపడిన చంద్రబాబును హైదరాబాదుకు తరలించి చికిత్స చేశారు. ఈ దాడిలో చంద్రబాబుతోపాటు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తిలకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడి తర్వాత ప్రజల్లో సానుభూతి వస్తుందన్న విశ్వాసంతో చంద్రబాబు అసెంబ్లీని రద్దు చేసి మరీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అయితే.. సానుభూతి పెద్దగా పని చేయలేదు. ప్రజల్లో విస్తృతంగా పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుకూలంగా ప్రచండమైన గాలులు వీయడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైఎస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు.

2013 జులై 21వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. హైదరాబాదులో నిర్వహించిన అఖిల భారత యాదవుల మహాసభలకు హాజరయ్యేందుకు వచ్చినపుడు కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ అనుచరులు అఖిలేశ్ యాదవ్‌పై దాడికి యత్నించారు. ఈ దాడిలో అఖిలేశ్ ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆయనకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ దాడి ఉత్తర్ ప్రదేశ్‌కు వెలుపల జరగడంతో ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ ఈ దాడి అంశాన్ని సానుభూతి అస్త్రంగా వాడుకోలేకపోయారు. అఖిలేశ్ పార్టీ ఓటమి పాలు కాగా.. యుపీలో బీజేపీ సింగిల్‌గా ఘన విజయం సాధించింది. యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రి అయ్యారు.

2018 జనవరి 13వ తేదీన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ళ దాడి జరిగింది. బక్సర్ జిల్లా నందన్‌ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు నితీశ్ కుమార్. ఆ తర్వాత ఈ దాడి గురించి పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ.. 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ-సమతా పార్టీల కూటమి విజయం సాధించడంతో నితీశ్ కుమార్ మరోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినా.. ముందుగా సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను ప్రకటించడంతో ఆ మాటకు కట్టుబడి ఆయనకే సీఎం సీటు ఇచ్చేశారు కమల నాథులు.

2018 నవంబర్ 20వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన కార్యాలయం బయట దాడికి యత్నించారు కొందరు దుండగులు. కేజ్రీవాల్‌పై కారంపొడి చల్లారు. వీరిలో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్ విపక్ష నేతగా వున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైజాగ్ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. 2018 అక్టోబర్ 25వ తేదీన జగన్‌పై ఎయిర్‌పోర్టు లాంజ్‌లో పని చేసే ఓ యువకుడు కోడి కత్తితో దాడికి యత్నించాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఆసుపత్రికి తరలించి తొమ్మిది కుట్లు వేశారు డాక్టర్లు. ఆ తర్వాత 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

తాజాగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై దాడి జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె స్వయంగా తనపై నలుగురు వ్యక్తులు దాడికి యత్నించారని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రచారానికి వెళితే తన చుట్టూ పోలీసులు లేరని, దాంతో నలుగురు తనను కారు బోనెట్‌పై నుంచి తోసేశారని ఆమె అంటున్నారు. దానిని రాజకీయంగా వాడుకునేందుకు తనకు గాయమైనట్లుగా ఫోటోలను విడుదల చేశారు. మార్చి 10న దాడి జరిగినట్లుగా చెప్పినట్లు కాలికి చిన్నపాటి కట్టుతో కనిపించిన మమతాబెనర్జీ.. మర్నాటికి కాలుగు పెద్ద బ్యాండేజ్‌తో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు కుడి కాలు, మడమ ఎముకతోపాటు.. కుడి భుజం, కుడి చేయి, మెడకు గాయాలయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మమతాబెనర్జీ డ్రామాలు ఆడుతున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం మమతా నాటకాలు ఆడుతున్నారని బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం నేతలు విమర్శించారు. ఈక్రమంలో తనపై దాడి జరిగినట్లుగా ప్రచారం చేసుకోవడం, తన శ్రేణులతో రోడ్డెక్కించి ఆందోళనలు చేయించడం మమతాబెనర్జీకి ఈ ఎన్నికల్లో ఏ మేరకు సానుభూతి తెచ్చిపెడుతుందో, ఏ మేరకు ఓట్లు సాధించి పెడుతుందో వేచి చూడాలి.

ALSO READ: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. ఓవైపు సైన్యం..మరోవైపు విపక్షం.. తప్పుకోవడం తప్పదేమో?