TN Elections 2021: తమిళనాట కమల్ హాసన్ కింగ్ మేకర్ అవుతారా? MNM పార్టీతో ఏ పార్టీకి నష్టం?

|

Apr 03, 2021 | 5:38 PM

Tamil Nadu Assembly Election 2021: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 6న పోలింగ్ జరగనుండగా...రేపు(ఆదివారం) సాయంత్రంతో ప్రచారపర్వం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కమల్ హాసన్ ఉవ్విళ్లూరుతున్నారు.

TN Elections 2021: తమిళనాట కమల్ హాసన్ కింగ్ మేకర్ అవుతారా? MNM పార్టీతో ఏ పార్టీకి నష్టం?
Kamal Haasan/File Photo
Follow us on

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతోంది. ఒకే విడతలో ఈ నెల 6న తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా…రేపు(ఆదివారం) సాయంత్రంతో ప్రచారపర్వం ముగియనుంది. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు.  తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను చాటాలని…కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరుతున్న నటుడు కమల్ హాసన్ కూడా చురుగ్గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ మక్కల్ నీతి మయ్యం(ఎంఎన్ఎం) లక్ష్యమంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్పు కోరుకునే వారు ఎన్నికల్లో తనతో కలిసిరావాలని, ఎంఎన్ఎం అభ్యర్థులకు ఓటువేయాలని పిలుపునిస్తున్నారు. ‘ప్రకాశవంతైన రేపటి రోజు మనదే’ అన్న నినాదంతో కమల్ హాసన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజాయితీ, అవినీతి రహిత పాలన అందిస్తానని చెబుతున్నారు.

కమల్ హాసన్ ఎన్నికల ప్రచారానికి ఆయా ప్రాంతాల్లో భారీ సంఖ్యలోనే జనం తరలివస్తున్నారు. ప్రచార ర్యాలీల్లో విలక్షణ నటుడిని ఫోటోలు తీసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే సినీ సెలబ్రిటీల సభలకు ప్రజలు తరలిరావడం పెద్ద విషయమేమీ కాదు. ప్రచార సభలకు వచ్చే వారిని తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసేలా ప్రభావితం చేయడమే అక్కడ పెద్ద ఛాలెంజ్. ఆ విషయం కమల్ హాసన్‌కి తెలియనిది కాదు. సినీ రంగం నుంచి వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు తమిళనాడుకు ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే నాటి రాజకీయ పరిస్థితులు వేరు…ఇప్పుడున్న పరిస్థితులు వేరు..

Kamal Haasan

ఇక నేరుగా విషయానికి వస్తే తమిళనాట కింగ్ కావడం ఇప్పటికిప్పుడు సాధ్యంకాదన్న విషయం కమల్ హాసన్‌కు కూడా తెలిసిందే. అయితే ఏ మాత్రం కాలం కలిసొచ్చినా…కింగ్ మేకర్ కావాలని మాత్రం పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కనీస సంఖ్యలో సీట్లు గెలిచినా…రాష్ట్రంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైతే కింగ్ మేకర్ కావొచ్చని ఆశపడుతున్నారు. కమల్ హాసన్ కింగ్ మేకర్ కాగలరా? అనే అంశంపై రాజకీయ పండితులు తమదైన విశ్లేషణలు చేస్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్‌కు 3.7 శాతం ఓట్లు దక్కాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌కు దక్కే ఓటింగ్ శాతం 8 శాతం వరకు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మార్పును కోరుకునే తొలిసారి ఓటువేసే యువకులు, పట్టణ మధ్యతరగతి ఓటర్లు కమల్ హాసన్‌కు బాసటగా నిలిస్తే…అది 10 శాతానికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేకనుక జరిగితే కమల్ హాసన్ కింగ్ మేకర్ కాకపోయినా…ఇతర ప్రధాన పార్టీల జయోపజయాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమల్ హాసన్ కింగ్ మేకర్ కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.

మరీ ముఖ్యంగా కమల్ హాసన్‌ పార్టీకి గ్రామీణ ప్రాంత ఓటర్ల మధ్య పెద్దగా ఆదరణ లభించడం లేదు. కమల్ హాసన్..ఎంజీఆర్, రజనీకాంత్‌లా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడు కాకపోవడమే దీనికి కారణం. కమల్ హాసన్‌ క్లాస్ హీరో అన్న అభిప్రాయం మొదటి నుంచీ ఉంది. అటు కమల్ హాసన్ అగ్రవర్ణానికి చెందినవాడు కావడం కూడా…చాలా మంది ఆయన పార్టీకి దగ్గరకాకపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాస్తికవాదంతో కమల్ హాసన్ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నా…ఎక్కువగా అగ్రవర్ణాల (బ్రాహ్మణులు) వారు మాత్రమే ఆయన వైపు మొగ్గుచూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

Kamal Haasan

సున్నితమైన అంశాల్లో కమల్ హాసన్ పార్టీకి స్పష్టమైన సిద్ధాంతం లేకపోవడాన్ని కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. కొందరు విమర్శకులు కమల్ హాసన్‌ను బీజేపీకి బీ టీమ్‌గానే అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా డీఎంకేకి పోల్‌కాకుండా చీల్చేందుకు కమల్ హాసన్‌ను బీజేపీ పావుగా వాడుకుంటోందని డీఎంకే-కాంగ్రెస్ మద్ధతుదారులు కొందరు ఆరోపిస్తున్నారు. ద్రవిడ రాజకీయాలను బలహీనపరచడమే కమల్ హాసన్ రహస్య అజెండాగా ఆరోపిస్తున్న వారు…తద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కే మేలు జరుగుతుందన్న వాదనవినిపిస్తున్నారు.

చాలా నియోజకవర్గాల్లో వందలు, ఒకట్రెండు వేలల్లోని ఓట్లే ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తుంటాయి. కమల్ హాసన్ పార్టీ 10 శాతం ఓట్లు దక్కించుకున్నా…చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు తారుమారయ్యే అవకాశముంది. అలా జరిగితే ఎక్కువ నష్టం మాత్రం డీఎంకే కూటమికే ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.