తమిళనాడులో ఐటి దాడుల కలకలం.. రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తున్న ఆదాయపన్నుల శాఖ..!

|

Mar 28, 2021 | 12:02 PM

అసెంబ్లీ ఎన్నికలవేళ తమిళనాడులో ఐటీ దాడులు కాకరేపుతున్నాయి. ఓవైపు ఉచిత హామీలతో పార్టీలు దుమ్ము రేపుతుంటే.. మరోవైపు సోదాలతో పార్టీలకు షాక్‌ ఇస్తోంది ఐటీ శాఖ.

తమిళనాడులో ఐటి దాడుల కలకలం.. రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తున్న ఆదాయపన్నుల శాఖ..!
Tamil Nadu It Rides
Follow us on

Tamil Nadu IT Rides: అసెంబ్లీ ఎన్నికలవేళ తమిళనాడులో ఐటీ దాడులు కాకరేపుతున్నాయి. ఓవైపు ఉచిత హామీలతో పార్టీలు దుమ్ము రేపుతుంటే.. మరోవైపు సోదాలతో పార్టీలకు షాక్‌ ఇస్తోంది ఆదాయ పన్ను శాఖ. దీంతో తమిళ రాజకీయం మలుపులతో సస్పన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

అసెంబ్లీ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఐటీ కన్ను తమిళనాడుపై పడింది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు, వారి బంధువుల ఇళ్లపై గురిపెట్టింది. ఎన్నికల టైంలో నాయకుల ఇళ్లపై వరుస ఐటీ దాడులు పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచేశాయి. పదుల సంఖ్యలో బృందాలు ఒక్కసారిగా దాడి చేసి కోట్ల రూపాయలు పట్టుకుంటున్నారు.

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అధికార, విపక్షాలకు చెందిన నేతల ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన మంత్రుల బంధువులు, సన్నిహితుల ఇళ్లలో భారీగా నగదు చిక్కుతోంది. ధర్మపురి జిల్లా మంత్రి ఎంసీ సంపత్ బంధువుల ఇళ్లలో రూ. 6కోట్ల వరకు నగదు పట్టుబడింది. ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ సోదరుల ఇళ్లలోనూ దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా భారీగా ఎత్తున వెండి సామాగ్రి, నగదు చిక్కినట్టు సమాచారం.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం ఏరులై పారుతోంది. కరెన్సీ కట్టలు తెగుతున్నాయి. కో అంటే కోటి దొరుకుతోంది. తిరుచ్చి జిల్లా ముసిరి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెల్వరాజ్‌ వాహనంలో కోటి రూపాయలు సీజ్‌ చేశారు. ఇద్దరు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ సహా నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు నుంచే తమిళనాడులో రాజకీయాలు హీటెక్కాయి. ఈసారి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం ఎంతటి డబ్బైన వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు నేతలు. ఇదిలావుంటే, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 265కోట్లు నగదు, బంగారం, వెండి, కుక్కర్లు వంటి ఇతర సామాగ్రిని ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకుంది. ఏ రోజుకారోజు డబ్బు దొరుకుతుండడంతో అధికారులు మరింత అలర్టయ్యారు.

ఇటీవలో కాలంలో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల కాలంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. మొత్తం 50 మంది ఐటీ ఆఫీసర్స్‌ 6 టీమ్స్‌గా విడిపోయి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు చిక్కినట్టు తెలుస్తోంది. తిరువణ్నామలై ఎమ్మెల్యే, డీఎంకే సీనియర్ నేత ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాలపై 10 చోట్ల ఐటీ దాడులు జరిగాయి.

కమల్‌ హాసన్ పార్టీ కోశాధికారి చంద్రశేఖరన్‌ నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ రెండు రోజులు ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 11కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే నేతలపై ఐటీ కన్ను పడింది. ఎన్నికల వేళ ఎలాంటి డబ్బు పంపకాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ శాఖ చెబుతోంది.

Read Also… రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం సిధ్ధం, వారే చొరవ తీసుకోవాలి, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్