Tamil Nadu Election 2021 : తమిళనాడు ప్రచారం మరింత వేడెక్కింది. డీఎంకే కూటమిపై వాగ్భాణాలు సంధించారు ప్రధాని మోదీ. డీఎంకే -కాంగ్రెస్ కూటమి అధికారం లోకి వస్తే తమిళనాడు మహిళలకు భద్రత ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిపై డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. తిరువూరు జిల్లా దారాపురంలో జరిగిన సభలో పాల్గొన్నారు ప్రధాని. కాలం చెల్లిన టూజీ మిస్సైల్‌ను డీఎంకే కూటమి వదిలిందని రాజాపై సెటైర్ విసిరారు మోదీ.
మహిళలను అగౌరవపర్చడమే డీఎంకే నేతల లక్ష్యమని మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లు డీఎంకే-కాంగ్రెస్ కూటమికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. స్కాంలు చేయడమే డీఎంకే-కాంగ్రెస్ నేతలకు తెలుసన్నారు. అమ్మ జయలలితను కూడా అవమానపర్చిన చరిత్ర డీఎంకేకు ఉందన్నారు మోదీ. అసెంబ్లీ సాక్షిగా జయలలితను డీఎంకే నేతలు అవమానించిన ఘటనను ఎవరు మరిచిపోరన్నారు.
అయితే, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై డీఎంకే ఎదురుదాడికి దిగింది. 1989లో తమిళనాడు అసెంబ్లీ జరిగిన అసలు విషయం మోదీకి తెలియదన్నారు డీఎంకే ఎంపీ ఇళంగోవన్. పళనిస్వామిపై చేసిన వ్యాఖ్యలకు రాజా ఇప్పటికే సారీ చెప్పారని అన్నారు. తమిళనాడు అసెంబీలో అందరి ముందు జయయలిత డీఎంకే నేత కరుణానిధి కళ్లాద్దాలు లాగారని ఆరోపించారు. ఆ విషయం తెలియని మోదీ జయలలితకు అవమానం జరిగిందని బాధపడడం విడ్డూరంగా ఉందన్నారు.
తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా ప్రచారం చేశారు మోదీ. కేరళ లోని పాలక్కాడ్‌లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. జూడాస్ వెండి కోసం జీసెస్‌ను మోసం చేసినట్టే కేరళ ప్రజలను బంగారం కోపం ఎల్‌డీఎఫ్ దగా చేసిందన్నారు. కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడులో అన్ని స్థానాలకు ఒకేదశలో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ డీఎంకే – అన్నాడీఎంకే కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.