sagar by election nominations process: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నోముల నర్సింహాయ్య కుమారుడు నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పానుగోతు రవికుమార్, టీడీపీ అభ్యర్థి మువ్వా రవికుమార్ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పలువురు స్వతంత్ర అభ్యర్థులు, వివిధ చిన్నాచితకా పార్టీలకు చెందిన 20 మంది ఇప్పటికే 23 నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మరో 30పైకి నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని సమాచారం.
కరోనా నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ సాదాసీదాగా సాగింది. నిడమనూరు తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రోహిత్ సింగ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరి కావడంతో అన్నిపార్టీల అభ్యర్థుల రాకతో నిడమనూరులో ఎన్నికల కోలహలం కనిపించింది.
కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 11వ సారి నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి ఆయన జనతా పార్టీ నుంచి 1978లో నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు 10 సార్లు పోటీ చేయగా ఏడుసార్లు గెలుపొందారు. 3 సార్లు మాత్రమే ఆయన ఓటమి చవిచూశారు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే నిమ్మల రాములు చేతిలో, 1994లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమిని చవిచూశారు. కాగా, సరికొత్త ఎన్నిక విధానానికి తెరతీద్దామన్నారు జానారెడ్డి. ఎవరూ ప్రచారానికి వెళ్లకుండా ప్రలోభ పరచకుండా ఆదర్శంగా నిలుద్దామని సలహా ఇచ్చారు.
అటు, టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నిడమనూరులో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహాయ్య అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నిక జరుగుతుంది. దీంతో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అనుహ్యంగా నోముల నర్సింహాయ్య కుమారుడి భగత్‌కు పార్టీ టికెట్ కేటాయించి, బీ-ఫామ్ అందించారు. దీంతో ఇవాళ భగత్ టీఆర్ఎస్ తరుఫున నామినేషన్ దాఖలు చేశారు.
ఇక, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రవికుమార్ నాయక్ నామినేషన్ నామినేషన్ వేశారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్టీ ఓటర్లు ఉన్నా.. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా లంబాడాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వలేదన్నారు. సాగర్‌లో బీజేపీదే విజయం అని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.
సాగర్ బరిలో నిలుస్తామని ప్రధాన పార్టీల నుంచి చాలామంది ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ల ఆశలు అడియాశలయ్యాయి. వాళ్లంతా పక్క చూపులుచూస్తున్నారు. పార్టీలను ఫిరాయింపుల ఫియర్ వెంటాడుతోంది. మరోవైపు టికెట్ రాని నేతల్ని బుజ్జగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగుతున్నారు. పలు రకాల హామీలతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలావుంటే, గెలుపు తమదే అంటూ ప్రకటించుకున్న బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. నాగార్జునసాగర్‌లో కీలక నేత కడారి అంజయ్య కారు ఎక్కేంందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారాయన. నాగార్జునసాగర్‌లో బీజేపీ టికెట్ ఆశించిన కడారి అంజయ్య… ఆ పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేశారు. మరో బీజేపీ నేత నివేదితరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండిః మహిళలను అవమానించడమే కాంగ్రెస్-డీఎంకే సంస్కృతి.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ