Rajasthan Election 2023: రేపే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన ఎన్నికల ప్రచారం!

| Edited By: Ravi Kiran

Nov 24, 2023 | 4:01 PM

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల 2023కు సమయం దగ్గరపడింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు నవంబర్‌ 25న ఎన్నికలు జరగనున్నాయి. కన్‌ఫూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ సెప్సిస్ కారణంగా మరణించడంతో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీని కారణంగా 199 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 25న ఓటింగ్ నిర్వహించనున్నామని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ..

Rajasthan Election 2023: రేపే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన ఎన్నికల ప్రచారం!
Rajasthan Elections
Follow us on

జైపూర్‌, నవంబర్‌ 24: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల 2023కు సమయం దగ్గరపడింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు నవంబర్‌ 25న ఎన్నికలు జరగనున్నాయి. కన్‌ఫూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ సెప్సిస్ కారణంగా మరణించడంతో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీని కారణంగా 199 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 25న ఓటింగ్ నిర్వహించనున్నామని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 51,507 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 5,26,90,146 మంది ఓటర్లు ఉన్నారు.

రాష్ట్రంలో 18-30 ఏళ్లలోపు 1,70,99,334 మంది యువ ఓటర్లు ఉన్నారు. ఇందులో 18-19 ఏళ్లలోపు 22,61,008 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. మొత్తం 200 సీట్లలో 25 షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీకి, 34 షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీకి, 141 జనరల్ కేటగిరీకి రిజర్వు చేశారు. మరోవైపు రాజకీయ పార్టీల బహిరంగ సభలు, ర్యాలీలు గురువారంతో ముగిశాయి. దీంతో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యే ఉండనుంది. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పథకాలు, ఇతర కార్యక్రమాలపై ప్రధానంగా ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించింది. ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏడు ప్రతిష్టాత్మక పథకాలను ప్రకటించింది. రాష్ట్రంలో నేరాలు, అవినీతి, పేపర్ లీకేజీల వంటి అంశాలపై బీజేపీ అధికార కాంగ్రెస్‌పై దాడి చేస్తోంది.

ఏ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల పగ్గాలు చేపట్టారు?

కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇతర నేతలు పలు ఎన్నికల సభల్లో ప్రసంగించారు. బీజేపీ ప్రచార పగ్గాలను ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆయన పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. బికనీర్‌, జైపూర్‌లలో కూడా రోడ్‌ షోలు నిర్వహించారు. అలాగే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్ కూడా పలు బహిరంగ సభలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

పోలింగ్‌ రోజున భారీ ఏర్పాట్లు..

రాజస్థాన్‌లో మొత్తం 36,101 చోట్ల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 10,501.. గ్రామీణ ప్రాంతాల్లో 41,006 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 26,393 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి ‘కంట్రోల్ రూం’ నుంచి పర్యవేక్షిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 65,277 ‘బ్యాలెట్ యూనిట్లు’, 62,372 ‘కంట్రోల్ యూనిట్లు’, 67,580 ‘VVPAT యంత్రాలు’ రిజర్వ్ ఓటింగ్ కోసం ఉపయోగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు 6,287 మంది మైక్రో అబ్జర్వర్లు, 6247 మంది సెక్టార్ అధికారులను నియమించినట్లు ఎలక్షన్‌ కమిషన్ తెలిపింది. 2,74,846 మంది పోలింగ్ సిబ్బంది ఓటింగ్ నిర్వహిస్తారని ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. వీరిలో.. మహిళా పోలింగ్‌ కేంద్రాల్లో 7960 మంది మహిళా సిబ్బంది, వికలాంగులు నిర్వహించే పోలింగ్‌ కేంద్రాల్లో 796 మంది వికలాంగ సిబ్బంది బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. శాంతియుతంగా ఓటింగ్‌ జరిగేలా 1,02,290 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అలాగే 69,114 మంది పోలీసు సిబ్బంది, 32,876 మంది రాజస్థాన్ హోంగార్డ్, ఫారెస్ట్ గార్డ్, RAC సిబ్బందిని.. 700 మంది CAPF సిబ్బంది మోహరించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి అసెంబ్లీలో 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 3 ఎస్‌ఎస్‌టీ బృందాలను ఓటింగ్‌ రోజున నిఘా కోసం ఏర్పాటు చేయనున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.