కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 115 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. అయన మంజేశ్వర్, కొన్నీ స్థానాల నుంచి పోటీ చేస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్జున్ సింగ్ చెప్పారు. పలక్కాడ్ నియోజకవర్గం నుంచి మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ పోటీ చేయనున్నారని వెల్లడించారు. 115 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం.. మిగిలిన 25 సీట్లను నాలుగు పార్టీలకు కేటాయించాం అన్నారు. అయితే 112 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తున్నాం అని అయన చెప్పారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.రాజశేఖరన్ నెమమ్ సీటు నుంచి, మాజీ కేంద్ర మంత్రి కె.జె. ఆల్ఫాన్స్ కంజీరాపల్లి నుంచి . సురేష్ గోపీ త్రిచూర్ నుంచి బరిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. కేరళలో ప్రధాన పోటీ పాలక లెఫ్ట్ ఫ్రంట్, విపక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ మధ్య జరుగుతున్నప్పటికీ బీజేపీ ఇక్కడ తన బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 91 స్థానాలకు పోటీ చేస్తుండగా..ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 27 సీట్లలో తన బలాన్ని పరీక్షించుకోగోరుతోంది. తనకు బీజేపీ ఏ నియోజకవర్గం కేటాయించినా గెలిచి తీరుతానని శ్రీధరన్ ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు.
ఇక సీపీఐ, సీపీఎం తమ అభ్యర్థుల పేర్లను ఇదివరకే ప్రకటించాయి. కాగా కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ముఖ్యంగా పాలక ఎల్ డీ ఎఫ్ ను ఇరకాటాన పెట్టవచ్చు.. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ ..కస్టమ్స్ అధికారులకు ఇచ్చిన తన వాంగ్మూలంలో సీఎం పినరయి విజయన్, స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ తదితరుల పేర్లను వెల్లడించి అందర్నీ షాక్ కి గురి చేసింది. దీంతో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనీ విపక్ష కాంగ్రెస్ ఇతర పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఇవి ఈ కేసును ప్రధానంగా తమ ప్రచారానికి వినియోగించుకోవచ్చు.అయితే ఈ కేసు పేరు చెప్పి ప్రతిపక్షాలు తన ప్రభుత్వ ప్రతిష్టను మంట గొలిపెందుకు యత్నిస్తున్నాయని, సత్యమే నిరూపితమవుతుందని విజయన్ ఆ మధ్య వ్యాఖ్యానించారు.
మరిన్ని చదవండి ఇక్కడ :సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video