Kerala Assembly Elections and History: దైవ భూమిగాను, దక్షిణాది వేసవి విడిదిగాను భావించే కేరళ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. దేశంలోని అయిదు రాష్ట్రాలకు నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన జరగబోతున్నాయి. 1956లో ఆవిర్భవించిన కేరళ రాష్ట్రంలో అంతకు ముందు ట్రావెన్ కోర్ కొచ్చిన్ అసెంబ్లీ పేరిట రెండుసార్లు ఎన్నికలకు వెళ్ళింది. 1956 నవంబర్ ఒకటవ తేదీన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కేరళగా ఆవిర్భవించిన కేరళలో తొలి ఎన్నికలు 1957 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగాయి. అంతకు ముందు ట్రావెన్ కోర్ కొచ్చిన అసెంబ్లీకి 1951-52, 1954లలో రెండు సార్లు జరిగాయి.
1951-52లో జరిగిన ట్రావెన్ కోర్ కొచ్చిన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)పై నిషేధం అమల్లో వుండింది. దాంతో కాంగ్రెస్ 44 సీట్లను, ఎస్పీ 11 స్థానాలో విజయం సాధించాయి. నిషేధం వున్న కారణంగా సీపీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. ట్రావెన్ కోర్ తమిళనాడు కాంగ్రెస్, కేరళ సోషలిస్టు పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎజే జాన్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత ట్రావెన్ కోర్ కొచ్చిన అసెంబ్లీకి రెండోసారి 1954లో ఎన్నికలు జరిగాయి.
కాంగ్రెస్, యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ ఆఫ్ లెఫ్టీస్ కూటమి (సీపీఐ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కేరళ సోషలిస్ట్ పార్టీ) మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 45 సీట్లు, సీపీఐకు 23 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1954 మార్చిలో పీఎస్పీ నేత పట్టం థాను పిళ్లై సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో పిళ్లై ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత మరో ప్రభుత్వం ఏర్పాటైనా 1956 మార్చి నుంచి కేరళ రాష్ట్రపతి పాలనలోనే వుంది. అదే కాలంలో కేరళ భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత నాలుగైదు నెలల తర్వాత అంటే ఫిబ్రవరి- మార్చి (1957) మధ్యకాలంలో కేరళ అసెంబ్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 126 సీట్లకు ఎన్నికలు జరగ్గా 60 సీట్లను గెలుచుకున్న సీపీఐ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 5వ తేదీన సీపీఐ నేత ఎలంకులం మనక్కల్ శంకర్ నంబూద్రిపాద్ కేరళ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి దాకా బలంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారానికి దూరమైంది. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల కారణంగా సీపీఐ పార్టీ ప్రజల్లో బాగా వేళ్ళూనుకుపోయింది. ఘనవిజయం సాధించింది.
అయితే రెండేళ్ళ కాలంలోనే కేరళ రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది. రాష్ట్రంలో చెలరేగిన ఆందోళన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను వినియోగించి కేరళలో రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత 1960లో కేరళ అసెంబ్లీకి రెండోసారి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు సీపీఐ ఒంటరిగా పోటీకి దిగింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 63 స్థానాల్లో గెలుపొందగా.. ప్రజా సోషలిస్టు పార్టీ 17 సీట్లలో గెలుపొందింది. పీఎస్పీ నేత పట్టం థాను పిళ్ళై సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 1961 నవంబర్ నెలలో ముస్లిం లీగ్ కేరళ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. దాంతో అక్కడ అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. సీఎంగా వున్న థాను పిళ్ళైని పంజాబ్ గవర్నర్‌గా పంపారు. కాంగ్రెస్ నేత శంకర్ కేరళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
1964లో మరోసారి కేరళలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ అసమ్మతి గ్రూప్ ఏర్పాటైంది. కాంగ్రెస్ అసమ్మతి గ్రూప్ పీఎస్పీతో కలిసి శంకర్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో ప్రభుత్వం రద్దు అయ్యింది. 1964 నుంచి 1967 వరకు కేరళలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరోవైపు జాతీయ స్థాయిలో 1965లో సీపీఐ చీలిపోయింది. సీపీఎం ఏర్పడింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చీలి.. కేరళ కాంగ్రెస్ ఏర్పాటైంది. 1965 మార్చి 4న మరోసారి కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 133 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ ఒంిరగాను.. సీపీఐ, ఎస్.ఎస్.పీ., ముస్లింలీగ్‌తోను కలిసి పోటీకి దిగాయి. సీపీఎం ఒంటిరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మరోసారి కేరళలో రాష్ట్రపతి పాలన విధించారు. సీపీఎం 40 సీట్లు, కాంగ్రెస్ 36 సీట్లు గెలుచుకున్నాయి. రెండేళ్ళ రాష్ట్రపతి పాలన తర్వాత 1967లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మార్చి నెలలో జరిగిన ఈ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ పేరిట సీపీఎం, సీపీఐ, ముస్లిం లీగ్, సంయుక్త సోషల్ పార్టీ, కర్షక్ తోజిలాయ్ పార్టీ, కేరళ సోషలిస్టుపార్టీ కలిసి కూటమిగా పోటీచేశాయి. జాతీయ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా.. కేరళ కాంగ్రెస్, స్వతంత్ర పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ ఘన విజయం సాధించగా.. నంబూద్రిపాద్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే, అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పార్టీల మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఈ తగాదాలు ఫ్రంట్ చీలికకు దారి తీశాయి. కొన్ని పార్టీలు ఫ్రంట్‌ను వీడడంతో నంబూద్రి పాద్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి వైదొలగాల్సి వచ్చింది. అనంతర రాజకీయ పరిణామాలతో సీపీఐ పార్టీ కాంగ్రెస్ మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 1969లో అచ్యుత మీనన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 1970 ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా మూడు నెలల పాటు కేరళలో రాష్ట్రపతి పాలనలో కొనసాగింది.
1970 సెప్టెంబర్‌లో కేరళలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 133 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. యునైటెట్ ఫ్రంట్ ( కాంగ్రెస్, సీపీఐ, ఐయుఎంఎల్, ఆర్ ఎస్పీ, పీఎస్పీ) 79 సీట్లలో విజయం సాధించింది. అచ్యుత మీనన్ సీఎం అయ్యారు. తొలిసారి కేరళకు అయిదేళ్ళ పరిపాలన అందించిన ఘనత అచ్యుత మీనన్‌కు దక్కుతుంది. ఈ ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించేదాకా కొనసాగింది. 1975 అక్టోబర్‌లో అచ్యుత మీనన్ పదవీ కాలం ముగిసినా.. ఎమర్జెన్సీ కారణంగా అసెంబ్లీ పదవీ కాలాన్ని మూడు సార్లు పొడిగించారు. ఆ తర్వాత 1977లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తే.. కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్‌కు అనుకూలంగా ఫలితాలొచ్చాయి. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించి.. నిర్బంధాన్ని ఎదుర్కొన్నా సీపీఐ ఆశ్చర్యకరంగా కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలను ఎదుర్కొని సానుకూల ఫలితాన్ని రాబట్టింది.
యునైటెడ్ ఫ్రంట్ 111 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1977 మార్చి 25న కాంగ్రెస్ నేత కె. కరుణాకరన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నెల రోజులకే కరుణాకరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజన్ కేసులో ఆయన పేరు ప్రస్తావనకు రావడంతో కరుణాకరన్ సీఎం సీటునుంచి తప్పుకున్నారు. ఏకే ఆంటోనీ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1978లో ఆంటోనీ రాజీనామా చేయడంతో.. సీపీఐకి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. పీకే వాసుదేవన్ నాయర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత కేరళలో రాజకీయ సమీకరణలు మారాయి. 1979 అక్టోబర్ 7వ తేదీన కేరళలో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఏర్పాటైంది. దాంతో వాసుదేవన్ నాయర్ రాజీనామా చేశారు. ముస్లింలీగ్ నేత మహ్మద్ కోయా ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే రెండు నెలల కాలంలోను అసెంబ్లీ రద్దైంది. కేరళలో మరోసారి రాష్ట్రపతి పాలనలోకి వచ్చింది.
1980 జనవరి మూడో తేదీన కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. తొలిసారి ఇందిరా కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఇందిరా కాంగ్రెస్, ముస్లిం లీగ్, కేసీ-జె, పీఎస్పీ, ఎన్డీపీ,ఎస్ ఆర్పీ), లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్-యు, కేసీ-ఎం,కేసీ-పీజీ, ఏఐఎంఎల్, ఆర్ఎస్పీ) హోరాహోరీగా తలపడ్డాయి. యుడీఎఫ్‌కు 46 సీట్లు రాగా, ఎల్డీఎఫ్ 93 సీట్లలో గెలుపొందింది. సీపీఐ నేత ఈకే నయనార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఏడాది కాలంలోనే లెఫ్ట్ ఫ్రంట్‌లో కుమ్ములాటలు జరగ్గా నయనార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రెండు నెలల రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్- ఎస్, కేసీ-ఎం యూడీఎఫ్‌లో చేరడంతో.. కాంగ్రెస్ నేత కే.కరుణాకరన్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ముచ్చట మూణ్ణాళ్ళకే ముగిసింది. యూడీఎఫ్‌కు కేసీ(ఎం) మద్దతు ఉపసంహరించడంతో కరుణాకరన్ రాజీనామా చేశారు. మరోసారి రాష్ట్రపతిపాలనలోకి కేరళ వెళ్ళింది.
1982 మేలో జరిగిన ఎన్నికల్లో యుడీఎఫ్ (కాంగ్రెస్-ఐ, కాంగ్రెస్-ఎ, ఐయుఎంఎల్, కేసీఎం, కేసీజే, జనత-గోపాలన్, ఎన్డీపీ, ఆర్ ఎస్పీ-ఎస్, పీఎస్పీ, డీఎల్పీ), ఎల్డీఎఫ్ (సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ -సోషలిస్ట్, ఆర్ ఎస్పీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, డీఎస్పీ) మధ్య పోటీ జరగ్గా.. యుడిఎఫ్ 77 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి కరుణాకరన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారు కరుణాకరన్. తిరిగి 1987లో జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించింది. నయనార్ సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో తొలిసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలిసారి కేరళలో పోటీ చేసింది. మున్నాని వర్గంతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఫలితాల్ని సాధించలేకపోయింది బీజేపీ.
80 దశకం నుంచి అయితే ఎల్డీఎఫ్, లేకపోతే యుడీఎఫ్ ఒక్కో ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాయి. 1991 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎప్ ఓడి.. అధికారంలోకి యుడీఎఫ్ వచ్చింది. మరోసారి కరుణాకరన్ సీఎం అయ్యారు. 1995లో వెలుగులోకి వచ్చిన ఇస్రో స్పై స్కామ్ నేపథ్యంలో కరుణాకరన్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఏకే ఆంటోనీ సీఎం అయ్యారు. 1996లో జరిగిన ఎన్నికల్లో యుడీఎఫ్ నుంచి ఎల్డీఎఫ్‌కు అధికార మార్పడి జరిగింది. నయనార్ మరోసారి సీఎం అయ్యారు. 2001లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎల్డీఎఫ్ నుంచి యుడీఎఫ్‌కు మారింది. నయనార్ దిగిపోయి ఏకే ఆంటోనీ సీఎం అయ్యారు. 2004 దాకా ఆంటోనీ సీఎంగా కొనసాగారు.. ఆయన కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళగా.. కేరళ సీఎం బాధ్యతలను ఊమెన్ ఛాందీ చేపట్టారు. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ (సీపీఎం, సీపీఐ, ఆర్ ఎస్పీ,జేడీ-ఎస్, కాంగ్రెస్ -సోషలిస్ట్, కేసీ-థామస్ ఎన్సీపీ, ఐఎన్ఎల్), యుడీఎఫ్ (కాంగ్రెస్,కేసీ-ఎం, కేసీ-బాలక్రిష్ణ పిళ్లై, కేసీ-జాకోబ్, కేసీ-సెక్యులర్, సీపీఎ, ఆర్ ఎస్పీ-బేబీజాన్, జన తిపతియా సంరక్షణ పార్టీ) హోరాహోరా తలపడ్డాయి. ఎల్డీఎఫ్ 98 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. దాంతో 2006 మేలో అచ్యుతానందన్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2011 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార మార్పిడి జరిగింది. ఎల్డీఎఫ్ స్వల్ప తేడాతో అధికారాన్ని వీడాల్సి వచ్చింది. 140 అసెంబ్లీ సీట్లకు గాను.. ఎల్డీఎఫ్ 68 సీట్లు గెలుపొందగా.. యుడీఎఫ్ 72 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఊమెన్ ఛాందీ మరోసారి సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-జెడియు కలిసి పోటీ చేసినా ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యుడీఎఫ్ అధికారాన్ని కోల్పోయింది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటముల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఎల్డీఎఫ్ 91 సీట్లను గెలుచుకోగా, యూడీఎఫ్ 47, ఎన్డీఏ ఒక సీటులో గెలుపొందాయి. సీపీఎం నేత పినరయి విజయన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రస్తుతం విజయన్ ప్రభుత్వం కొనసాగుతుండగా.. రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. ఒకవైపు కరోనా నియంత్రణలో ఘోరమైన వైఫల్యం సీఎం విజయన్‌కు మైనస్ పాయింట్‌గా మారింది. ఇంకోవైపు బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులపైనే ఆరోపణలు వచ్చాయి. ఇది సీఎంకు మచ్చగా మిగిలింది. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనవరి 2021లో కేరళలో కొన్ని రాజకీయ పరిణామాలు సంభవించాయి. కేరళ అసెంబ్లీ స్పీకర్ పీ. శ్రీరామకృష్ణన్‌పై యుడీఎఫ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనికి బీజేపీ సింగిల్ ఎమ్మెల్యే రాజగోపాల్ కూడా మద్దతిచ్చారు. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత కేరళలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ ఆరో తేదీన సింగిల్ ఫేస్‌లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యుడీఎఫ్, ఎన్డీయేల నుంచి ఎల్డీఎఫ్‌కు గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ALSO READ: గవర్నర్‌కు అవమానం.. దత్తన్నపై దాడికి కాంగ్రెస్ సభ్యుల యత్నం..
ALSO READ: వైజాగ్‌లో ఎక్కువ.. గూడూరులో తక్కువ..లెక్కలతో పార్టీలు బిజీబిజీ
ALSO READ: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!
ALSO READ: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?