Election Commission to meet health secretary: దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. నిత్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పదుల్లో ఉన్న కేసులు చూస్తుండగానే.. వందలకు చేరాయి. తాజా పరిణామాలు చూస్తే.. వేలకు చేరువ అవ్వడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. వచ్చే ఏడాది ప్రారంభంలో (మరికొన్ని రోజుల్లో) ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారింది. దీంతో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఎన్నికల నిర్వహణ, కోవిడ్ తీవ్రతపై చర్చించనుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో ఎలక్షన్ కమిషన్ అధికారులు కీలక భేటి నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూనియన్ హెల్త్ సెక్రటరీ రాకేష్ భూషన్ హాజరవనున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిపై ఇప్పటి నుంచే సందిగ్ధం ఏర్పడింది. దేశంలో కరోనా, ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవతున్నాయి. దీంతో ఇవాళ్టి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో 2022 ఫిబ్రవరి, మార్చిల్లో ఎన్నికలు జరుగనున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వొచ్చా? ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? సాధ్యసాధ్యాలేంటి? ఇందుకు ఆరోగ్య శాఖ సన్నద్ధత ఎలా ఉంది ఉని తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం సమావేశం అవుతుంది. ఓమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచన చేస్తోంది.
ఒమిక్రాన్, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణపై ఈసీ ఓ నిర్ణయానికి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: