Murder: పచ్చని పొలాలు ఎరుపెక్కాయి. వరి నాట్లు రక్తంతో తడిచాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మ గూడెం గ్రామంలో ప్రవీణ్ హత్య కలకలం రేపుతోంది. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి తెల్లవారుజామున ఇంటి వెనకాల దారుణ హత్యకు గురయ్యాడు. నిద్రపోతున్న అతను బయటకు ఎలా వచ్చాడన్నది ఒక మిస్టరీ గా మారింది.
దుండగులు బయటకు తీసుకొస్తున్నా ప్రవీణ్ కు మెళుకువ రాలేదా? నిద్రలేవకుండా అతనికి కావాలనే మత్తు మందు ఇచ్చారా? ఇంట్లో నుంచి ప్రవీణ్‌ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఆ సమయంలో ఇంట్లో ఎవరూ కుటుంబ సభ్యులు లేరా? అసలు ఏం జరిగింది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు పోలీసులతోపాటు అందరి మదినీ తొలుస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ నేపథ్యం మీద కూడా ఆరాతీయడం మొదలుపెట్టారు.
అటు, ప్రవీణ్ హత్య నిమ్మ గూడెం గ్రామ ప్రజల్ని సైతం భయకంపితుల్ని చేస్తోంది. నిమ్మ గూడెం గ్రామంలో అందిరివలనే తిరిగే 32 ఏళ్ల జాడి ప్రవీణ్ దారుణ హత్యకు గురవడం గ్రామస్తుల్ని కలవరపెడుతోంది. ఇంట్లో నిద్రిస్తున్నాడనకున్న వ్యక్తి తెల్లవారుజామున ఇంటి వెనకాల దారుణహత్యకు ఎలా గురయ్యాడనేది అటు, కుటుంబ సభ్యులకు కూడా అంతుబట్టకుండా ఉంది.
మృతుడు ప్రవీణ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రవీణ్ హత్య విషయం గ్రామమంతా దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున డెత్ స్పాట్ దగ్గరకి చేరుకున్నారు. అటు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్యోదంతానికి సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.