Godavari river: గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పెంపుడు కుక్క స్నానం చేయించడానికి వెళ్లిన ఆ యువకులు తిరాగానిలోకానికి వెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని రిక్షా కాలనీలో నివాసముంటున్న నిమ్మల వెంకటేశ్వరరావు కుమారుడు నిమ్మల హరిచంద్ (25) తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు తన స్నేహితులైన జమ్మి షణ్ముఖరావు (23), చక్రిలతో కలిసి మోతే పట్టీనగర్ పుష్కరఘాట్ సమీపంలో గోదావరి నదిలోకి దిగారు.
కుక్కకు స్నానం చేస్తున్న క్రమంలో అది లోతైన ప్రాంతానికి వెళ్లడంతో దానిని కాపాడే ప్రయత్నంలో హరిచంద్, షణ్ముఖరావు వెళ్లి నీటిలో గల్లంతయ్యారు. గమనించిన చక్రి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఆ ఇద్దరు యువకుల జాడ తెలియరాలేదు. దీంతో రిక్షానగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: