సెల్ఫీ మోజు కొన్ని సార్లు ప్రాణాలనూ హరిస్తోంది. స్వీయ చిత్రం తీసుకోవాలన్న ఆరాటంలో కొందరు యువకులు వెనుకాముందూ ఆలోచించకుండా ప్రవరిస్తున్నారు. ఇలా చేస్తే పక్కనున్న వారిని, తమకు హాని కలుగుతోందా అనే విషయాన్నీ పట్టించుకోవడం లేదు. సెల్ ఫోన్ కెమెరా మీద ధ్యాస పెట్టి చుట్టూ ఏం జరుగుతోందని గమనించకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో సెల్ఫీలు, ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ సమయం వృథా చేయడమే కాకుండా అప్పుడప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో రైలు పట్టాలపై సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.
మధ్యప్రదేశ్ బేతూల్ జిల్లాలోని మచనా నదిపై ఉన్న రైల్వే వంతెనపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే వంతెనపై సెల్ఫీలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ముఖేష్ ఉయికే, మనీల్ మార్స్కోల్ వివాహ వేడుకకు వెళ్లేందుకు ఇంటినుంచి బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే వంతెనపై స్వీయచిత్రం తీసుకుంటున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన భాగమతి రైలు.. సెల్ఫీలు తీసుకుంటున్న యువకులను ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు.