Nalgonda Police officials Suspend: దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్.ఐ. డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరా లను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏవి రంగనాధ్ తెలిపారు. భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా దళిత యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపణలపై ఎస్పీ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్.ఐ., కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఎస్పీ రంగనాధ్ దృష్టికి రావడంతో రెండు రోజుల క్రితం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇందుకోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించారు. విచారణ అధికారి సతీష్ చోడగిరి బాధితునితో పాటు చికిత్స చేసిన వైద్యులు, మరికొంత మందిని విచారించిన ఆనంతరం ఎస్.ఐ.,కానిస్టేబుల్ తప్పు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎస్.ఐ. నర్సింహులు, కానిస్టేబుల్ లను నాగుల్‌లపై చర్యలు తీసుకోవాలంటూ సిఫార్సు చేశారు. పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా జిల్లా ఎస్పీ రంగనాధ్ సిఫార్సు మేరకు హైదరాబాద్ రేంజ్ డిఐజి వి.బి. కమలహాసన్ రెడ్డి వీరిద్దని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలావుంటే, రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి నల్లగొండ పట్టణంలో లేని భూమిని కాగితాలపై ఉన్నట్లుగా చూపించి విక్రయించడని, ఆ భూమిలో ఇల్లు నిర్మాణం చేసి ఉన్నదని బాధిత వ్యక్తులు 6 జులై 2021 రోజున టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. దీంతో రొయ్య శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. చీటింగ్ కేసుకు సంబంధించి గత నెల 10వ తేదీన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి నోటిసులు ఇచ్చారు. లేని భూమిని విక్రయం చేసిన వ్యవహారంలో శ్రీనివాస్ 35% కమిషన్ తీసుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనివాస్ తో పాటు అతడిపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి సమగ్రంగా అన్ని వివరాలు సేకరించిన దర్యాప్తు బృందం నివేదికను జిల్లా ఎస్పీకి సమర్పించింది. పోలీసుల తప్పు ఉన్నట్లుగా నిర్ధారణ జరిగడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
అయితే, ఎవరో ఒక వ్యక్తిని కాళ్లు కట్టేసి కొడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వీడియో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ది కాదని మొదట జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తిని కొడుతున్నట్లుగా అసత్య ప్రచారం సాగుతుందన్నారు. ఆ వీడియో నల్లగొండ జిల్లాకు సబందించినది కాదని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. తప్పుడు ప్రచారాలు, వైరల్ అవుతున్న వీడియోను ప్రజలు నమ్మవద్దని జిల్లా ప్రజలను కోరారు. అయితే, విచారణలో పోలీసుల తప్పిదం గుర్తించి చర్యలు చేపట్టింది పోలీసు శాఖ.
Read Also… Medak Collector: ఈటల జమున ఆరోపణలపై మెదక్ కలెక్టర్ స్పందన.. కీలక వివరాలు వెల్లడించిన హరీష్!