Fake seeds seized in Nalgonda district: ప్రభుత్వ యంత్రాంగం దాడులు చేస్తున్నా, కేసులు పెడుతున్నా కొందరు కేటుగాళ్లు నిరంతరం మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల పట్టుబడ్డ నకిలీ విత్తనాల వ్యవహారం చూస్తుంటే ఎంతగా వారు వేళ్లూనికుని పోయారో అర్థమవుతోంది. ఖరీఫీ సీజన్ ప్రారంభంతో ప్రత్యేక టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. అడపాదడపా దాడులు చేస్తూనే ఉన్నారు. నకిలీలు బురిడీ కొట్టించి ఎందరో రైతులను మోసం చేసి తమ దందాను కొనసాగిస్తున్నారు.
ఇటీవల సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.. తాజాగా నల్లగొండ జిల్లాలో మరో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. రూ. 6 కోట్ల విలువైన నకిలీ వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడటంతో ఎక్కడి నుంచి జిల్లాకు వస్తున్నాయన్న దానిపై దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాల నుంచి నల్లగొండకు నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తో్ంది.
దేవరకొండ ప్రాంతానికి చెందిన పలువురు రైతులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ ఫోర్స్ బృందాలు 15 రోజులుగా ఈ నకిలీ దందా వ్యవహారంపై లోతుగా దర్యాప్తు నిర్వహించినట్లు వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అక్రమ దందాకు పాల్పడుతున్న 13 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్ రెడ్డిని గతంలో ఇదే తరహా కేసులో అరెస్టయి పీడీ యాక్ట్ కింద వరంగల్ జైలుకు వెళ్లివచ్చాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం ప్రవృత్తిని మార్చుకోకుండా నకిలీ పత్తి విత్తనాలను తయారీ చేసి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ సీజన్‌లో వీటిని విక్రయించేందుకు ఖమ్మంకు చెందిన పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన బాలస్వామి, దేవరకొండకు చెందిన పిచ్చయ్య, హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, పవన్‌లతోపాటు మరికొంత మందితో ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున దందా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సిద్దిపేటలోని గజ్వేల్, ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలోని గుండ్ల పోచంపల్లి, యల్లంపేట, దేవర యంజాల్, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 140 టన్నుల వరి విత్తనాలు, 40 టన్నుల మొక్కజొన్న విత్తనాలు, నాలుగు కింటాళ్ల కూరగాయల విత్తనాలు స్వాధీనం చేసున్నారు.
ఈ కేసులో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు, చార్టెడ్ అకౌంటెంట్ ఏనుబోతుల శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో నైరుతి సీడ్స్ పేరుతో కంపెనీ స్థాపించి అదే పేరుతో నకిలీ విత్తనాల దందా నిర్వహిస్తున్నాడని ఐజీ తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి గత నాలుగేండ్లుగా రైతుల నుంచి వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను తక్కువ ధరకు సేకరిస్తున్నాడు. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రొసెసింగ్ యూనిట్లలో వాటిని ప్రొసెస్ చేసి జీఓటీ పరీక్షలను సైతం నిర్వహించకుండా, లైసెన్స్ లేకుండా సీడ్స్ ప్యాకింగ్ కవర్లు, వాటిపై క్యూఆర్ కోడ్, ఇతర లేబుల్స్ తానే ముద్రించి విక్రయించేవాడని తెలిపారు.
గడువు ముగిసిన ప్యాకెట్లను టిన్నర్ వినియోగించి గడువు తేదీలను చెరిపివేసి కొత్త తేదీలను ముద్రించి విక్రయించేవాడని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి భాగస్వామి మెడిశెట్టి గోవింద్‌కు చెందిన దేవరాయంజాల్‌లోని ఎంజీ అగ్రిటెక్ ప్రొసెసింగ్ యూనిట్‌లో నకిలీ పత్తి విత్తనాల ప్రొసెసింగ్ వ్యవహారంపై అతడిని విచారించగా నంద్యాలకు చెందిన గోరుకంటి పవన్ కుమార్‌ను తాను శ్రీనివాస్ రెడ్డి పరిచయం చేయగా అతని ద్వారా పాత నేరస్థులైన నంద్యాలకు చెందిన మధుసూదన్ రెడ్డి, స్వామిదాస్ పరిచయమైనట్లు తెలిపాడు.
వీరి నుంచి శ్రీనివాస్ రెడ్డి రిజెక్టేడ్ సీడ్స్, గడువు తీరిన విత్తనాలు, జిన్నింగ్ మిల్లుల నుంచి పత్తి గింజలను తీసుకొని వచ్చి తన ప్రొసెసింగ్ యూనిట్‌లో ప్రొసెస్ చేసిన అనంతరం ట్రూత్ ఫుల్ లేబుల్స్‌ను ముద్రించి అందమైన కవర్లలో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి తరలించేందుకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారని ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. మరో ప్రధాన నిందితుడు మధుసూదన్ రెడ్డి 2016 నుంచి నకిలీ విత్తనాల కేసుల్లో పలుమార్లు అరెస్టయి గతేడాది పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చి మళ్లీ ఇదే వ్యాపారాన్ని చేస్తున్నాడని వివరించారు. నంద్యాల ప్రాంతానికి చెందిన గోష స్వామిదాస్, దుబ్బ వెంకట శివారెడ్డి, హుస్సేన్ వలి అలియాస్ బాషా, బండారు సుధాకర్ తదితరుల వద్ద నుంచి కిలో రూ. 200లకు విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు కిలోకు రూ. 900 రూపాయలు (అరకిలో ప్యాకెట్ కు రూ. 450/-) చొప్పున విక్రయిస్తారని చెప్పారు.
అనుచరులైన చెన్నకేశవ రెడ్డి, మధుల సహకారంతో వీటిని రవాణా చేస్తున్నాడన్నారు. నంద్యాలకు చెందిన మరో నిందితుడు, పలు కేసుల్లో జైలుకెళ్లిన గోరుకంటి పవన్ కుమార్ ప్రధాన నిందితులతో నకిలీ విత్తనాలను కమీషన్ వ్యాపారం చేస్తూ దందా సాగిస్తున్నాడని చెప్పారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితురాలు, ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి భార్య నైరుతి సీడ్స్ భాగస్వామి ఏనుబోతుల రజిత భర్త నకిలీ విత్తనాల దందాకు చేదోడుగా నిలుస్తూ అతడి అనుచరులను సమన్వయం చేస్తుండేదని ఐజీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన జిల్లా పోలీసులను ఆయన అభినందించారు.
ఈ ముఠా తయారు చేసిన నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు వర్షాదారిత పంటలు ఎక్కవగా వేసే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాతోపాటు పలు ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాల విక్రయానికి యత్నించారు. పత్తి విత్తనాల లైసెన్స్, విక్రయాలకు అనుమతి లేకుండానే శ్రీనివాస్ రెడ్డి తాను విక్రయించే నకిలీ విత్తనాలను నాణ్యమైనవిగా రైతులను నమ్మించేందుకు నాగ్‌పూర్‌కు చెందిన ఐసీఏఆర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా అవసరం లేకున్నా ప్యాకింగ్ కవర్లపై ముద్రిస్తున్నాడని వివరించారు.
Read Also….