నమ్మించి నయవంచన చేసే మహామాయగాడు, 7 రాష్ట్రాల్లో ఎన్నో నేరాలు, హైటెక్ బుర్రతో ఎన్ ఫీల్డ్ కొట్టేసి 5వేల కిలోమీటర్ల ప్రయాణం

|

Apr 12, 2021 | 10:57 AM

Thief travels : సెల్ఫ్ డ్రైవ్ ఏజెన్సీల నుండి అద్దెకు తీసుకున్న వాహనాలను దొంగిలించే హైటెక్ కేటుగాడ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు...

నమ్మించి నయవంచన చేసే మహామాయగాడు, 7 రాష్ట్రాల్లో ఎన్నో నేరాలు, హైటెక్ బుర్రతో ఎన్ ఫీల్డ్ కొట్టేసి 5వేల కిలోమీటర్ల ప్రయాణం
Royal Enfield
Follow us on

Thief travels : సెల్ఫ్ డ్రైవ్ ఏజెన్సీల నుండి అద్దెకు తీసుకున్న వాహనాలను దొంగిలించే హైటెక్ కేటుగాడ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.70లక్షల విలువైన ఆరు కార్లు, ఒక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హైటెక్ నేరగాడి వివరాలు, నేర ఉదంతాలు వెల్లడించారు. రూమ్ లలో అద్దెకు దిగడం.. అడ్డంగా దోచేయడం అతనికి వెన్నతోపెట్టిన విద్య. అంతేకాదు, బైక్ లంటే పిచ్చి. కార్లంటే వ్యామోహం. చాకచక్యంగా హైటెక్ బ్రైన్ ఉపయోగించి దొంగతనాలకు పాల్పడతాడు. ఇలా మొత్తంగా 7 రాష్ట్రాల్లో 15 కేసుల్లో మహేష్ నిందితుడు. ఒక్క ఏడాదిలోనే 7 రాష్ట్రాల్లో ఆరు ఖరీదైన కార్లు కొట్టేసి సొమ్ము చేసుకున్న ఘరానా ఇంజనీరింగ్‌ దొంగ ఆటకట్టించారు ఎట్టకేలకు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు.

మహేష్ నేపథ్యంలోకి వెళితే, పశ్చిమగోదావరికి జిల్లా భీమవరానికి చెందిన గుడాటి మహేష్‌ నూతన్‌ కుమార్‌ 2016లో ఈఈఈలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేటలో మొబైల్‌ టెక్నీషియన్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న మొబైల్‌ షాఫును నకిలీ తాళం చెవులతో తెరిచి ఫోన్‌లు, ఇతర యాక్సెసెరీస్‌ దొంగిలించడంతో దొంగగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఇలా పలు నేరాల్లో శిక్ష అనుభవించి 2018లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఎస్‌ఆర్‌నగర్‌లో ఒక షేరింగ్‌ రూమ్‌లో అద్దెకు దిగి రూం మేట్ ను మోసగించి మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. గతేడాది జూన్‌లో జైలు నుంచి మళ్లీ బయటకు వచ్చిన మహేష్‌ తన ఇంజనీరింగ్‌ బుర్రకు పదును పెట్టాడు. రూమ్‌ షేరింగ్‌ యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ యాప్‌ ద్వారా పంజాగుట్ట పరిధిలో నాగేంద్రప్రసాద్‌ అనే యువకుడి రూమ్‌లో షేరింగ్‌ పార్ట్‌నర్‌గా అద్దెకు దిగాడు.

నెలరోజుల నమ్మకంగా ఉండి.. అతని ఆధార్‌కార్డు, లైసెన్స్‌తోపాటు రూ. 1.60 లక్షలు దోచుకొని చెంగిచెర్లకు, ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చాడు. కొట్టేసిన అడ్రస్‌ ప్రూఫ్స్‌లో ఫొటో ఎడిట్‌ చేసి రాయల్‌ బ్రదర్స్‌ సంస్థలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అద్దెకు తీసుకున్నాడు. దానిపై మహేష్‌ విశాఖపట్నం నుంచి లడఖ్ వరకూ దాదాపు ఐదు వేల కిలోమీటర్లు జాలీగా తిరిగొచ్చాడు. ఇలా ఎన్నో చోరీలు, మోసాలు చేసి చివరికి సిటీ పోలీసులకు చిక్కాడు.

Read also : జీహెచ్ఎంసీలో కరెంట్ షాక్‌లకు ఇంకెంత మంది బలి కావాలి.? మౌలాలిలో చిన్నారి నిషాంత్ మ‌ృతిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి కేటీఆర్