Chhattisgarh Boy Abducted: తిరుపతిలో ఆరేళ్ల బాలుడు సాహు కిడ్నాప్ కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. కిడ్నాపర్ ఊహా చిత్రంతో పాటు అతనికి సంబంధించిన విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. నిందితుడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మరోవైపు కిడ్నాపర్ సాహుని ఎత్తుకెళ్లాక ఎటువైపు వెళ్లాడు..? పరిసర ప్రాంతాల్లోనే తలదాచుకున్నాడా..? వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు..? ఈ సందేహాలతో సిటీలోని సీసీ ఫుటేజ్ మొత్తం తిరగేస్తున్నారు పోలీసులు. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు నిన్నంతా కమాండ్ కంట్రోల్‌లోనే మకాంవేసి.. దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలతో మాట్లాడారు.
ఆరేళ్ల బాలుడు.. కనిపించకుండాపోయి అప్పుడే ఏడు రోజులు అవుతుంది. బిడ్డ ఎప్పుడెప్పుడు వస్తాడా అని సాహు తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కునుకు తీయడం లేదు.. మెతుకు మింగడం లేదు. నిద్రాహారాలు మాని కొడుకు కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కిడ్నాపర్ తమ బిడ్డను క్షేమంగా వదిలిపెట్టాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. కన్నవాళ్లను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.
చత్తీస్‌గఢ్‌లోని కురుద్ ప్రాంతం నుంచి దాదాపు 55 మంది ఓ బస్సులో ఏపీలోని ఆలయాల దర్శనానికి వచ్చారు. ఫిబ్రవరి 23న చత్తీస్‌గఢ్.. 24న విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 26న శ్రీశైలం వెళ్లి 27న తిరుపతికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి అలిపిరి లింక్ బస్టాండ్ దగ్గర సేద దీరుతున్న సమయంలో కిడ్నాపర్ బాలుడిని ఎత్తుకెళ్లాడు. బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలర్టయిన పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. 9.50 నిమిషాలకు కిడ్నాపర్ సాహూను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.
గత నెల 27న రాత్రి 9గంటల 20 నిమిషాలకు సాహూను కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. దానికి మూడు గంటల ముందే నిందితుడు ఆటోలో దిగాడు. ఆ తర్వాత పక్కా ప్లాన్ తో రెక్కీ నిర్వహించి బాలుడ్ని తీసుకెళ్లాడు. ఇంత పకడ్బందీగా పిల్లాడ్ని ఎత్తుకెళ్లడం అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది. బాగా తెలిసినవాడే పిల్లాడ్ని ఎత్తుకెళ్లాడా..? లేదంటే ప్రొఫెషనల్ కిడ్నాపరా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కిడ్నాపర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్నాటకలో 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అన్నవరం సర్కిల్ నుంచి కిడ్నాపర్ ఎటువెళ్లాడనే కోణంలో ప్రధానంగా ఆరాతీస్తున్నారు. సాహు తల్లిదండ్రుల పక్కన కాలక్షేపం చేసిన టైమ్‌లో కిడ్నాపర్ పేపర్ చదువుతూ కనిపించాడు. అది తెలుగు పేపర్ కావడంతో నిందితుడు లోకల్‌వాడేనని పోలీసులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోనే తలదాచుకున్నాడనే అనుమానంతో గాలింపు ముమ్మరం చేశారు.