Shilpa Chowdary Cheating Case: కిట్టీ పార్టీలతో మొదలుపెట్టి.. కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరిగిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి కోర్టు గురువారం బెయిల్ మంజూరు అయింది. ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పెటుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే.. వారిలో దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్ మంజూరైంది. మరో రెండు కేసుల్లో బెయిల్ లభించలేదు. దీంతోపాటు ఆమె జైలులోనే ఉండనుంది.
కాగా.. విచారణలో భాగంగా పోలీసులు శిల్పా చౌదరి బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాకు సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేయగా.. లాకర్‌లో ఏమీ లభించలేదు. దీంతో శిల్పా ఆ డబ్బును ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆమె పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే.. ఎలాంటి ఆధారాలు లభించకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటా, పలు బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also Read: