Serial Rapist Jailed: అత్యాచారం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. నేరం తీవ్రతను బట్టి దోషికి ఏకంగా వెయ్యి ఎనబై ఎనిమిది ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 33 ఏళ్ళ సెల్లో అబ్రమ్ మాపున్యా అనే వ్యక్తి 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్ల కాలంలో ఇళ్ళల్లో చొరబడి దొంగతనాలు చేశాడు. దొంగతనాలతో పాటు మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడ్డాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని ప్రీటోరియా కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇళ్ళల్లో చోరీలు చేయడంతో పాటు 41 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు కోర్టు ధ్రువీకరించింది. అతడికి 1,088 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక న్యాయస్థానం తీర్పు ప్రకటించగానే అక్కడే ఉన్న బాధిత మహిళలు, వారి కుటుంబాల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. ఐదేళ్ళ తమ పోరాటానికి ఫలితం దక్కిందని సంతృప్తి వ్యక్తం చేశారు.