Murders in Tirupati: టెంపుల్ సిటీలో వరస హత్యలు.. భయాందోళన కలిగిస్తున్న ఘటనలు

|

Feb 08, 2022 | 9:32 AM

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం, టెంపుల్ సిటీ తిరుపతి(Tirupati)లో వరస హత్యలు, ప్రతీకార హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న పాటి గొడవలు, మసస్పర్థలు, అతిగా ఊహించుకోవడం వంటి కారణాలతో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి...

Murders in Tirupati: టెంపుల్ సిటీలో వరస హత్యలు.. భయాందోళన కలిగిస్తున్న ఘటనలు
Tpt Murders
Follow us on

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం, టెంపుల్ సిటీ తిరుపతి(Tirupati)లో వరస హత్యలు, ప్రతీకార హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న పాటి గొడవలు, మసస్పర్థలు, అతిగా ఊహించుకోవడం వంటి కారణాలతో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జనవరి 3న తిరుపతిలోని ఉప్పంగి ఎస్సీ కాలనీకి చెందిన 28 ఏళ్ల ప్రసన్న కుమార్ హత్యకు గురయ్యాడు. అందుకు ప్రతీకారంగా లక్ష్మీపతి అనే యువకుడిని హత్యచేశారు. స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలే ఈ రెండు హత్యల(Murders)కు కారణంగా పోలీసులు గుర్తించారు. జనవరి 4న ఏపీ టూరిజం కార్పొరేషన్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ ను హత్య చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన విభేదాలతోచంద్రశేఖర్ ను చంపి, భాకరాపేట అడవుల్లో మృతదేహాన్ని పడేశారు. జనవరి 30 న పేరూరు చెరువు వద్ద బాషా అనే యువకుడిని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ నెల 6న పెద్ద కాపు వీధిలోని ఒక లాడ్జిలో అన్నాదొరై హత్యకు గురయ్యాడు.

ప్రసన్న కుమార్, లక్ష్మీపతిల హత్య…
తిరుపతిలోని శ్రీనివాసపురానికి చెందిన లక్ష్మీపతి మద్యం ఎక్కువగా తాగేవాడు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ, తోటివారితో ఘర్షణకు దిగేవాడు. మరోవైపు ఉప్పంగి హరిజనవాడకు చెందిన వంశీ.. తన బంధువైన ప్రసన్న కుమార్‌ అలియాస్‌ బొజ్జను జనవరి 3న రేణిగుంట రోడ్డులోని ఓ లాడ్జి వద్ద ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. ఆ హత్యతో లక్ష్మీపతికి సంబంధం లేనప్పటికీ.. తానే ప్రసన్న కుమార్‌ హత్యకు తానే ప్రణాళిక రచించి, చంపించానని అంటుండేవాడు. మద్యం మత్తులో లక్ష్మీపతి ప్రసన్న కుమార్‌ బంధువు వంశీకి ఫోన్‌చేసి ప్రసన్న కుమార్‌ హత్య తానే చేయించానని చెప్పాడు. దీంతో వంశీ, మరికొందరు లక్ష్మీపతి ఇంటికెళ్లి ప్రసన్న కుమార్‌ హత్య విషయమై ఆరా తీశారు. ‘మద్యం మత్తులో ఏదో మాట్లాడుతున్నాడు. వాడి మాటలు పట్టించుకోవద్దు’ అని లక్ష్మీపతి బంధువులు వారికి నచ్చజెప్పి పంపించారు. మరోసారి లక్ష్మీపతి తన స్నేహితులతో ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. లక్ష్మీపతి మాటలతో కోపోద్రిక్తుడైన వంశీ.. లక్ష్మీపతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో లక్ష్మీపతి ఇంటికెళ్లి, మాట్లాడుకుందాం రమ్మంటూ ద్విచక్రవాహనంపై ఉప్పంగి హరిజనవాడకు తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం లక్ష్మీపతిపై కత్తితో దాడి చేసి చంపేశాడు.

చంద్రశేఖర్ హత్య…
ఏపీ టూరిజం కార్పొరేషన్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ జనవరి 4న న దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన విభేదాలతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సుత్తితో కొట్టి, అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అనంతరం చేతులు, కాళ్లు కట్టి గోనె సంచెలో కుక్కి, అట్ట పెట్టెలో ఫ్యాకింగ్ చేసి భాకరాపేట అడవుల్లో పడేశారు. చంద్రశేఖర్‌ వద్ద ఫైనాన్స్ తీసుకున్న మధు, రాజు, పురుషోత్తంలే ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధరించారు.

అన్నాదొరై హత్య…
పెద్దకాపు లే ఔట్ లోని వల్లి రెసిడెన్సీలో చిత్తూరు అంబేడ్కర్ నగర్ మురకంబట్టుకు చెందిన కలవగుంట అన్నాదొరై, తన స్నేహితుడితో గకిసి గదిని తీసుకున్నాడు. రాత్రి 12 సమయంలో అన్నాదొరైను దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి స్నేహితుడు పరారయ్యాడు. ఆదివారం ఉదయం లాడ్జి సిబ్బంది హత్య సమాచారాన్ని పోలీసులకు అందించారు. సంఘటన స్థలానికి ఈస్ట్ డీఎస్పీ మురళి కృష్ణ ఇతర పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతికి గల కారణాలను కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు.