సినీపక్కీలో రూ.2 కోట్ల సెల్‌ఫోన్లు చోరీ

|

Sep 23, 2020 | 12:18 PM

రెండున్నర కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. కంటైనర్‌లో నుంచి సెల్‌ఫోన్లు అపహరించిన ఘటన ఈనెల 16న మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగింది.

సినీపక్కీలో రూ.2 కోట్ల సెల్‌ఫోన్లు చోరీ
Follow us on

దొంగలు కంటైనర్లను టార్గెట్ చేస్తున్నారు. అందులో తరలించే సెల్ ఫోన్లను డ్రైవర్ కు తెలియకుండానే తస్కరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరుచుగా వెలుగుచూస్తున్నాయి. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో గతనెల రెండు కంటైనర్లు, గుంటూరు జిల్లాలో ఓ కంటైనర్ నుంచి ఇలా కోట్ల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను చోరీ చేశారు దుండగులు. తాజా ఇలాంటి ఘటననే తెలంగాణలో జరిగింది.

రెండున్నర కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. కంటైనర్‌లో నుంచి సెల్‌ఫోన్లు అపహరించిన ఘటన ఈనెల 16న మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగింది. చెన్నై నుంచి ఢిల్లీకి కంటైనర్ లో తరలిస్తుండగా దొంగలు చాకచక్యంగా కొట్టేశారు. మెదక్‌ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ లో చోరీపై కేసు నమోదు అయింది. అయితే, ఈ సెల్‌ఫోన్‌లు ఎలా పోయాయి… కొట్టేసింది ఎవరు అనే కోణంగా విచారణ చేపట్టిన పోలీసులు దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు.

ఒకటి కాదు రెండు కాదు 2,400 సెల్ ఫోన్లు… వీటి విలువ అక్షరాల రెండున్నర కోట్లు. కంటైనర్‌లో తరలిస్తుంటే దొంగల ముఠా కన్నేసింది. పక్కా ప్లానుతో పకడ్బందీగా ఎవరికి అనుమానం రాకుండా కొట్టేశారు. ఈనెల 15న చెన్నై నుంచి దిల్లీకి రెడ్‌మీ కంపెనీకి చెందిన రూ.11 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను తీసుకుని కంటైనర్‌ బయలుదేరింది. కంటైనర్‌ డ్రైవర్‌ దేవేందర్‌ 16వ తేదీ రాత్రి 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట వద్ద 45 నిమిషాల పాటు ఆపాడు. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు తీసుకెళుతున్న విషయం ముందే తెలుసుకున్న దుండగులు అవకాశం కోసం కాచుకుని ఉండి ఇక్కడ అపహరించారు.సెల్ ఫోన్ల చోరీపై కంపెనీ ప్రతినిధులు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల పాటు తర్జన భర్జన పడిన పోలీసులు చివరకు కేసు నమోదు చేశారు. కంటైనర్‌ హర్యానాకు చెందినదని, డ్రైవర్‌ యూపీకి చెందినవాడని పోలీసులు తెలిపారు. దొంగల ముఠా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
.