
Social Media Danger: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం నేటి తరం కుర్రకారు ఏ స్థాయికి దిగజారుతుందో, ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడుతుందో చెప్పడానికి కడప జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. అప్పటివరకు కళ్లముందే నవ్వుతూ పని చేసుకున్న ఇద్దరు కూలీలు, కేవలం ఒకే ఒక్క వీడియో మోజులో పడి అనంత లోకాలకు వెళ్లిపోయిన తీరు స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది.
కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని ఆటో నగర్ కాలనీలో ఈ గుండెలవిసే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక వాటర్ సర్వీసింగ్ సెంటర్లో జీవనోపాధి కోసం జార్ఖండ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన కొందరు యువకులు పని చేస్తున్నారు. రోజులాగే శ్రమించి పని ముగించుకున్న వారు, రాత్రి ఎనిమిది గంటల సమయంలో సర్వీసింగ్ కేంద్రాన్ని శుభ్రం చేయడం ప్రారంభించారు. అయితే రీల్స్ పిచ్చి ఊహించని ప్రమాదానికి దారితీసింది. చేతిలో ఉన్న వాటర్ పైపుతో నీళ్లను పైకి చిమ్ముతూ, మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు.
చాలా సేపటి వరకు నీటితో రకరకాలుగా ఆడుకుంటూ వీడియోలు తీసుకున్న ఆ యువకులు, ఆ తర్వాత చేసిన ఒక చిన్న పొరపాటు వారి జీవితాలనే ముగించేసింది. వాటర్ సర్వీసింగ్ సెంటర్ పైభాగంలో హై వోల్టేజ్ విద్యుత్ వైర్లు వెళ్తుండగా, యువకులు ఏమాత్రం గమనించకుండా వాటర్ పైపుతో నీళ్లను అత్యంత వేగంగా ఆ వైర్ల వైపు కొట్టారు. నీరు మంచి విద్యుత్ వాహకం కావడంతో, ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి విద్యుత్ తీగల నుంచి కరెంట్ నీటి ధార ద్వారా పైపుకు సరఫరా అయింది. ఈ ఘోర ప్రమాదంలో పైపు పట్టుకున్న ఝార్ఖండ్ కు చెందిన సుమిత్ నాయక్ అనే యువకుడు కరెంట్ షాక్ తీవ్రతకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కళ్లముందే తన స్నేహితుడు కరెంట్ షాక్‌కు గురై కొట్టుమిట్టాడుతుండటం చూసి అక్కడే ఉన్న సంజయ్ కుమార్ అనే మరో యువకుడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా తన మిత్రుడిని కాపాడాలనే ఆరాటంతో ముందుకు వెక్రాడడు. అయితే విద్యుత్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సంజయ్ కుమార్ కూడా తీవ్రమైన షాక్‌కు గురై ఆపస్మారక స్థితిలో అక్కడే పడిపోయాడు. గమనించిన స్థానికులు, తోటి కార్మికులు వెంటనే స్పందించి సంజయ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆ యువకుడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..