Appalaraju Six murders : విశాఖ జిల్లా జుత్తాడలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పలరాజు ఇంటిపై దాడికి బాధితుల బంధువులు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో బాధితుల బంధువులు – పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అప్పలరాజు కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని బాధితుల బంధువులు డిమాండ్ చేశారు. దీంతో జుత్తాడలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, ఈ తెల్లవారుజామున రమణ కుటుంబ సభ్యుల్లో ఆరుగురిని అప్పలరాజు నరికి చంపిన సంగతి తెలిసిందే. రమణ కుమారుడు విజయ్ వివాహేతర సంబంధం వల్లే ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. అప్పలరాజు ఊచకోతలో విజయ్ తండ్రి రమణ, విజయ్ భార్య ఉషారాణి, ఆమె తల్లి రమాదేవి, పిన్ని అరుణ, మరో ఇద్దరు పిల్లలు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. ఈ ఘటన విశాఖ జిల్లాలో సంచలనం రేపింది.
కాగా, బత్తిన అప్పలరాజు కూతురు పార్వతి, బమ్మిడి విజయ్ కుమార్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మోసం చేశాడని.. 2018లో విజయ్ కుమార్ పై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు యువతి తరఫు బంధువులు. ఆ తర్వాత విజయవాడ వెళ్లిన విజయ్ కుమార్‌కు అక్కడే ఉషారాణితో వివాహమైంది. ఆ తర్వాత.. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. విజయ్ తండ్రి రమణ మాత్రం.. జుత్తాడలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల MPTC ఎన్నికల్లో ఓటేయడానికి జుత్తాడ వచ్చిన విజయ్ కుమార్ భార్య ఉషారాణి, చిన్నత్త సహా ఇక్కడే ఉండిపోయారు. విజయ్ తన పెద్ద కుమారుడితో శివాజీ పాలెంలో ఉండిపోయాడు. ఈ క్రమంలో విజయ్ సహా.. కుటుంబసభ్యుల హత్యకు ప్లాన్ వేసిన అప్పలరాజు.. ఇంట్లోకి ఎంటరై ఆరుగురిని కడతేర్చాడు. ఆ సమయంలో ఇంట్లో లేని విజయ్.. అప్పలరాజు నుంచి తప్పించుకున్నాడు.