Chittoor Snake Smugglers Arrest: మన్ను తినే పామును ఇంట్లో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయా? ఆ పామును చంపి తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందా? క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు నయమైపోతాయా? ఇలాంటి మాయ మాటలతో పాముల్ని బడాబాబులకి అంటగడుతున్న స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారులు.
పూడు (రెండు తలల) పాముల అక్రమ రవాణా చేస్తున్న ముఠాను చిత్తూరు తూర్పు విభాగం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. చిత్తూరు సమీపంలోని చెన్నమ్మగుడిపల్లె సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మంది సభ్యులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫారెస్ట్ అధికారి నరేందిరన్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగున్నర కిలోల బరువైన అరుదైన పామును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పూడు పాములు సాధారణంగా ఒకట్రెండు కేజీలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ పాము మాత్రం 4.5 కేజీలు ఉంది. ఇంత బరువున్న పాములు కనిపించడం చాలా అరుదు. స్మగ్లింగ్ గ్యాంగ్ పూడు పాములను తరలిస్తుందనే పక్కా సమాచారంతో చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు చిన్నమ్మ గుడిపల్లె రైల్వే గేటు దగ్గర మాటువేశారు. బకెట్‌లో ఉన్న పాము చేతులు మారే క్రమంలో మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వాళ్లంతా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
తమిళనాడులోని పుతాగారం గ్రామానికి చెందిన పాండురంగన్ గోపాల్ అనే మాయగాడు పామును అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. ఇద్దరికి మీడియేటర్లుగా కేరళ, కర్నాటకకు చెందిన వాళ్లున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పూడు పాములకు చాలా డిమాండ్ బాగా ఉంది. ఇండియా, ఇరాన్, పాకిస్థాన్‌లో మాత్రమే దొరికే అత్యంత అరుదైన పూడు పాముల కోసం స్మగ్లర్లు వేట కొనసాగిస్తున్నారు. దీనినే ఆసరగా చేసుకున్న కేటుగాళ్లు సొమ్ము చేసుకోవాలనుకున్నారు. పాములను పట్టి ఇచ్చేందుకు ఒప్పందం కుదరుర్చుకున్నారు. ఈ క్రమంలో పాములు చేతులు మారుతుండగా, పక్కా ఫ్లాన్‌తో చిత్తూరు జిల్లా పోలీసులు స్మగర్ల గుట్టురట్టు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.
మూఢనమ్మకాలతో పూడుపాముకి ధర పెరిగిందని.. స్మగ్లింగ్ గ్యాంగ్‌లు చెప్పే మాయమాటల్ని ఎవరూ నమ్మొద్దని సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.