Great Escape: ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. దానికి తగ్గట్టుగానే జైలు అధికారులు కూడా వారిని కంట్రోల్ లో ఉంచేందుకు కొత్త కొత్త ప్లాన్స్ సిద్ధం చేస్తూ ఉంటారు. కానీ, ఈ ఖైదీలు మాత్రం చాలా పాత తరహాలో గోడ దూకి పారిపోయారు. దీంతో జైలు అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. ఇక్కడి మహాసముండ్ జిల్లా జైలు నుంచి గురువారం 21 అడుగుల ఎత్తైన గోడను దూకి ఐదుగురు ఖైదీలు తప్పించుకున్నారు. వీరంతా తీవ్ర నేరాలతో సంబంధం ఉన్నవారే. ముగ్గురు ఖైదీలు దోపిడీ కేసుల్లోనూ.. ఒకరు అత్యాచారం ఆరోపణల్లోనూ, మరొకరు డ్రగ్స్ కలిగి ఉన్న కేసులోనూ నిందితులని జైలర్ చెప్పారు. వారి పేర్లు ధన్ సింగ్, దామ్రుధర్, రాహుల్, దౌలత్, కరణ్ అని తెలిపారు.
ముప్ఫై నిమిషాల్లో..
ఈ ఘటనలో ఖైదీలు 30 నిమిషాల్లో జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ సిసిటివి ఫుటేజ్ బయటపడింది. మహాసముండ్ జిల్లాకు చెందిన మేఘా తేంబుర్కర్, మొత్తం సంఘటనపై దర్యాప్తు చేసి జైలు అధికారుల నిర్లక్ష్యమే ఖైదీల పరారీకి కారణంగా తేల్చారు. ఒక శాలువా..దుప్పటి.. ఒక ఇనుప కొక్కెం సహాయంతో వారు గోడదూకేశారు. శాలువా, దుప్పటి కలిపి కట్టి.. దాని చివరలో ఇనుప కొక్కేన్ని కట్టిన ఖైదీలు ఆ కొక్కెం గోడపైకి విసిరారు. దాదాపుగా చాలా సార్లు ఆ ప్రయత్నం చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. నలుగురు ఈ కొక్కేన్ని గోడమీదకు విసిరే ప్రయత్నం చేస్తుంటే.. ఒకరు అటువైపుగా ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ నిలుచున్నారు. కొన్ని విఫల ప్రయత్నాల తరువాత కొక్కెం గోడకు చిక్కుకుంది. ఆ తరువాత ఒకరి వెనుక ఒకరు గోడపైకి ఎక్కి రెండో వైపు దూకి పారిపోయారు.
సంఘటన చివరలో జైలులోని సెంట్రీ విషయాన్ని గమనించారు. వెంటనే అలారం మోగించారు. దీంతో జైలర్ తన స్కూటర్ తో వారిని వెంబడించారు. కానీ ఐదుగురు ఐదు దారుల్లో పారిపోవడంతో.. వారిని చేరుకోలేకపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఛత్తీస్ గడ్ లో సంచలనంగా మారింది. పట్టపగలు 5 గురు ఖైదీలు జైలు గోడదూకి పారిపోవడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
ఘటనపై జైలర్ ఆర్ఎస్ సింగ్ మాట్లాడుతూ ”మధ్యాహ్న భోజనం తరువాత ఖైదీలు తమ తమ బారక్స్ లో ఉన్నారు. కొందరు అక్కడ బయట చేయాల్సిన పనుల్లో ఉన్నారు. తప్పించుకున్న ఖైదీలు కూడా ఇలాగే బయట పనుల్లో ఉన్నారు. ఖైదీలు తప్పించుకున్న విషయం నాకు సిబ్బంది చెప్పారు. వెంటనే ఆలారం మోగించి నేను నా స్కూటర్ పై ఖైదీలను అనుసరించాను. కానీ, వారు వేర్వేరు దిక్కులలో పరుగులు తీయడంతో నేను పట్టుకోలేకపోయాను. ఈ సంఘటనపై నేను అధికారులకు సమాచారం ఇచ్చాను.” అని చెప్పారు.
పోలీసుల చెబుతున్న దాని ప్రకారం.. 33 ఏళ్ల ధనసయ్య, 24 ఏళ్ల దామ్రుధర్ అలాగే, 22 ఏళ్ల రాహుల్ దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహాసముండ్‌లోనే ఈ దోపిడీలు చేశారు.. 2019 నుండి అదే జైలులో ఉన్నాడు. వీరిలో రాహుల్ యూపీ నివాసి, మిగతా ఇద్దరు మహాసముండ్ వాసులు. అత్యాచారం ఆరోపణలపై 23 ఏళ్ల దౌలత్‌ను అరెస్టు చేశారు. కరణ్ (21) మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నందుకు పట్టుబడ్డాడు, వీరిద్దరూ కూడా మహాసముండ్ నివాసితులు.
ఖైదీలు తప్పించుకున్న సమాచారం తెలిసిన వెంటనే, ఎ.ఎస్.పి మేఘా తేంబుర్కర్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె వెంటనే జైలు సిసిటివి కంట్రోల్ రూమ్ కి వెళ్లారు. ఖైదీలు తప్పించుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ గోడ 21 అడుగుల ఎత్తు. ఖైదీలు చాలా సులభంగా ఈ గోడను దాటడం అధికారులను కలవరపెడుతోంది. ప్రస్తుతం నగరం మొత్తం బ్లాక్ చేశారు. తప్పించుకున్న ఖైదీల గురించి సమాచారం పెట్రోలింగ్ బృందానికి ఇచ్చారు. పోలీసు ప్రత్యేక బృందాలు వారిని కనుగొనే పనిలో ఉన్నాయి.
Also Read: Terrorists: మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై ఉగ్రవాదుల బాంబు దాడి..ఆందోళన వ్యక్తం చేసిన భారత్
Alleges Molestation: బాబా ముసుగులో ఆగడాలు.. జైపూర్‌లో నలుగురు మహిళలపై లైంగిక దాడి