Five jump running train: కదులుతున్న రైలులోకి ఎక్కడం కానీ.. దానిలో నుంచి దిగడం కానీ.. చేయవద్దని భారతీయ రైల్వే నిరంతరం అనౌన్స్‌మెంట్ చేస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది అవేమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా.. వేరే రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైల్లో నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35) గా గుర్తించారు. అజయ్ తన బంధువులు జగ్‌మోహన్, సోదరుడు విజయ్, సందీప్, సంజయ్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు ఝాన్సీకి వచ్చినట్టు ప్రభుత్వ రైల్వే పోలీసులు వెల్లడించారు. రాత్రి 12:30 గంటల సమయంలో ఏపీ రైలు అనుకుని వీరంతా ఢిల్లీ వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు.
అయితే ఆ రైలు ఢిల్లీ వెళ్తుందని తెలియడంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ క్రమంలో అజయ్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారంతా తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
Also Read: