Mumbai: భద్రత వలయంలో ముంబయి.. బెదిరింపు మెసేజ్ తో అప్రమత్తమైన అధికారులు.. భయం గుప్పిట్లో స్థానికులు

|

Aug 21, 2022 | 6:59 AM

దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబయి (Mumbai) మరోసారి ఉలిక్కిపడింది. 26/11 దాడులను మరిచిపోకముందే అలాంటి ఘటనకు పాల్పడుతున్నట్లు వచ్చిన మెసేజ్ ముంబయి వాసులను కలవరపెడుతోంది...

Mumbai: భద్రత వలయంలో ముంబయి.. బెదిరింపు మెసేజ్ తో అప్రమత్తమైన అధికారులు.. భయం గుప్పిట్లో స్థానికులు
Mumbai Attack
Follow us on

దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబయి (Mumbai) మరోసారి ఉలిక్కిపడింది. 26/11 దాడులను మరిచిపోకముందే అలాంటి ఘటనకు పాల్పడుతున్నట్లు వచ్చిన మెసేజ్ ముంబయి వాసులను కలవరపెడుతోంది. పాకిస్తాన్‌ నుంచి ముంబయి పోలీసులకు వచ్చిన ఈ మెసేజ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బెదిరింపు నేపథ్యంతో పోలీసులు, ఉన్నతాధికారులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి 26/11 అటాక్స్ జరుగుతాయంటూ ముంబయి పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ (Mumbai Traffic Cell) సెల్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు సందేశం పంపించాడు. ట్రాఫిక్ కంట్రోల్ సెల్ వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన ఈ బెదిరింపు సందేశం పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముంబయి పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు శుక్రవారం రాత్రి వచ్చిన ఈ మెసేజ్ కాల్‌ కలకలం రేపుతోంది. ముంబయిలో దాడి జరగబోతోందని, భారత్‌లో ఆరుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడతారని మెసేజ్‌లో దుండగుడు వార్నింగ్ ఇచ్చాడు. 26/11 అటాక్స్ లాంటి దాడులు జరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తం అయ్యింది. ముందస్తు జాగ్రత్తగా ముంబయి నగరంలో భద్రతను పటిష్టం చేశారు.

ఒసామా బిన్‌ లాడెన్‌, అజ్మల్‌ కసబ్‌, అయమాన్‌ అల్‌ జవహరిని చంపితే ఏమైంది? ఇంకా చాలా మందే ఉన్నారు అంటూ ఆ మెసేజ్‌లో దుండగులు వార్నింగ్ ఇచ్చారు. కాగా.. రెండు రోజుల క్రితమే మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కూడిన పడవను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా బెదిరింపులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఈ బెదిరింపు లపై పోలీసు బలగాలు విచారిస్తున్నాయి. అన్ని భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇది నిజమైన బెదిరింపా? లేక ఫ్రాంక్‌ సందేశమా? అన్న కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

కాగా.. 2008లో పాకిస్తాన్ జీహాదీలు ముంబయి నగరంలో కాల్పులు, బాంబు దాడులు చేశారు. 26 నవంబరు నుంచి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందు, సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి. ముంబయి పోర్టు ఏరియాలోని మాజగావ్ లో, విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.