ED Chargesheet: లెక్క తేలుతోంది.. అక్రమాల పుట్ట పగులుతోంది.. ఆనాటి నోట్ల రద్దు స్కామ్‌ తాజాగా బట్టబయలు.. ఈడీ చార్జిషీట్ దాఖలు..!

|

Jun 01, 2021 | 8:59 PM

ఈడీ అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తోంది. నోట్ల రద్దు టైమ్‌లో అక్రమాలకు తెరలేపిన వ్యాపారులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.

ED Chargesheet: లెక్క తేలుతోంది.. అక్రమాల పుట్ట పగులుతోంది.. ఆనాటి నోట్ల రద్దు స్కామ్‌ తాజాగా బట్టబయలు.. ఈడీ చార్జిషీట్ దాఖలు..!
Notes Demonetisation Time Irregularities Ed Chargesheet On 14 Businessman
Follow us on

Irregularities ED Charge Sheet: దేశంలో నల్లధనం అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. 8 నవంబర్ 2016 తేదీన డీమానిటైజేషన్‌ను ప్రధాని మోదీ ప్రకటించారు. నోట్ల రద్దు సందర్భంలో జరిగిన కొన్ని చట్టవ్యతిరేక చర్యల నేపధ్యంలో… తాజాగా, 25 మంది బంగారం వ్యాపారులు, మరో 16 మంది చార్టెడ్ అకౌంటెల్ల‌పై చార్జిషీట్ దాఖ‌లైంది. నోట్ల రద్దు సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డ జ్యువలరీ వ్యాపారులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. మొత్తం 111 మంది పేర్లను ఈడీ పేర్కొంది..

ఈడీ అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తోంది. నోట్ల రద్దు టైమ్‌లో అక్రమాలకు తెరలేపిన వ్యాపారులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ప్రధానంగా మనీ ల్యాండరింగ్‌పై దృష్టిసారించిన ఈడీ రూ.130 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్‌ చేసింది.

నోట్ల రద్దు ప్రకటించిన రోజే రూ.500, రూ. వెయ్యి నోట్లతో కూడిన రూ.111 కోట్లను ముసద్దిలాల్‌ జ్యువెలర్స్‌ తమ బ్యాంక్‌లో వేసుకుంది. రూ.111 కోట్లు కస్టమర్లు బంగారం కొనుగోలు సందర్భంగా వచ్చినట్టుగా నకిలీ ఇన్‌వాయిస్‌ క్రియేట్‌ చేయడం అప్పట్లో కలకలం రేపింది. ముసద్దిలాల్‌ జ్యువెలర్స్‌కు చెందిన కైలాష్‌చంద్‌గుప్తాతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసింది ఈడీ. మిగతా బంగారం వ్యాపారులతో చేతులు కలిపి నల్లధనంగా మార్చుకున్నారు కొందరు వ్యాపారులు. చార్జ్‌షీట్లో 41 మందితో పాటు ముసద్దిలాల్‌ ప్రమోటర్స్‌, చార్టెడ్‌ అకౌంటెట్లను నిందితులుగా చేర్చింది ఈడీ.

నల్ల కుబేరుల భరతం పట్టడానికి అప్పట్లో మోదీ సర్కార్‌ పెద్ద నోట్లను రద్దు చేసింది. ఉగ్ర కార్యకలాపాల ఆర్థిక మూలాలు, బడా వ్యాపారుల బాగోతాలకు ముకుతాడు వేసేందుకు నోట్ల రద్దు ఉపయోగపడుతుందన్న చర్చ సాగింది. లక్ష్యం మంచిదే అయినా నోట్ల రద్దు నిర్ణయం కొంతమంది అక్రమార్కుల వల్ల నీరుగారిపోయింది. బ్యాంకర్స్‌తో కుమ్మక్కైన పలువురు వ్యాపారులు రాత్రికి రాత్రే నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నారు. దొడ్డిదారులు తొక్కిన పలువురు బంగారం వ్యాపారులు బడా స్కామ్‌కు పాల్పడ్డారు.

అప్పటి అక్రమాలు ఇప్పుడు నిగ్గుతేలుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన స్కామ్‌ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నోట్ల రద్దు తెల్లారే జరిగిన ఈ స్కామ్‌ వెలుగుచూసింది. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉన్న 25 మంది ప్రముఖ బంగారం వ్యాపారులు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ స్కామ్‌లో ముసద్దిలాల్‌ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. జ్యువెల్లరీ అసోసియేషన్‌ తరఫున ఈ వ్యవహారమంతా నడవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ స్కామ్‌లో ఇన్వాల్వ్‌ అయిన వారిపై గతంలోనూ కేసులున్నాయి. బంగారం రవాణా, బ్యాంకర్స్‌ను చీట్‌ చేసిన మోసగాళ్లే ఈ దందాకు పాల్పడ్డారు. ప్రధానంగా బజరంగ్‌ పరిషత్‌ జ్యువెల్లర్స్‌, విజయ్‌ జ్యువెల్లర్స్‌, రాజేంద్రకుమార్‌ జ్యువెల్లర్స్‌, విజయ్‌ విఠల్‌దాస్‌ జ్యువెల్లర్స్‌, ఇండ్రెల్లా జ్యువెల్లర్స్‌, మురారి ఎక్స్‌పోర్ట్స్‌, ప్రీతి జ్యువెల్లర్స్‌, శ్రీ యష్‌ జ్యువెల్లర్స్‌, నవదుర్గా జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లర్స్‌, ఓనమాల జగదీశ్వరయ్య, సూరజ్‌భాన్‌ జ్యువెల్లర్స్‌, శ్రీ కల్పతరు జ్యువెల్లర్స్‌, టిబారుమల్‌ రామ్‌నివాస్‌ జెమ్స్‌ జ్యువెల్స్‌ అండ్‌ పెరల్స్‌, సంజయ్‌ జ్యువెల్లర్స్‌పై ఆరోపణలున్నాయి. అప్పట్లోనే ఈ జ్యువెల్లర్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తగా.. ఈడీ వీరిపై కన్నేసింది. అక్రమార్కుల గుట్టు రట్టు చేసింది. తాజాగా చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read Also..జన్‌ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. బీమా పధకం రూ. 1.30 లక్షల వరకు ప్రయోజనాలు.. వివరాలివే..