దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో దోషులకు పడ్డ ఉరిశిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిసారి చివరి నిమిషంలో కొత్త కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటూ.. ఉరితీత వాయిదా పడేలా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగోసారి డెత్ వారెంట్‌ను ఢిల్లీలోని పటియాల కోర్ట్ జారీ చేసింది. మార్చి 20వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరితీయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ డెత్ వారెంట్‌ను యావజ్జీవంగా మార్చాలంటూ నిర్భయ దోషి వినయ్ శర్మ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు పిటిషన్ పెట్టుకున్నాడు. తన మరణ శిక్షను యావజ్జీవ కారాగారా శిక్షగా మార్చాలని.. జైల్లో ఉన్న సమయంలో తనలో మార్పును గమనించాలని.. దాన్ని పరిగణలోకి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాగా.. ఇప్పటికే న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోవడంతో.. మార్చి 20న ఉరిశిక్ష పడుతుందన్న ఆశాభావంతో నిర్భయ తల్లి ఆశాదేవి వేచిచూస్తోంది.