Jyotiraditya Scindia Facebook Hacked: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినేట్‌లో జ్యోతిరాధిత్య సింధియా పౌర విమానయాన శాఖ మంత్రిగా బుధవారం సాయంత్రం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కొంతసేపటికే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది సేపటికే ఆయన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. సింధియా ప్రమాణ స్వీకారం వీడియోలు హల్ చల్ చేస్తున్న సమయంలోనే హ్యాకర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన ప్రసంగం వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న సింధియా.. అధికార బీజేపీ, ప్రధాని మోదీని విమర్శించిన పాత వీడియోను హ్యాకర్లు పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన సిబ్బంది గుర్తించి దానిని తొలగించారు.
అయితే.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే ఇలా జరగడం కలకలం రేపింది. అయితే.. జ్యోతిరాదిత్య సింధియా ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైన సంఘటనపై ఆయన సొంత ఊరు గ్వాలియర్‌లో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ బీజేపీ, గ్వాలియర్ మాజీ ఎమ్మెల్యే రమేశ్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
50 ఏళ్ల జ్యోతిరాదిత్య సింధియా సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగి.. అంతర్గత విబేధాలతో పార్టీని వీడి.. బీజేపీలో చేరారు. 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ గద్దెనెక్కెలా వ్యవహరించారు. అనంతరం బీజేపీ సింధియాను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి.. తాజాగా కేంద్ర మంత్రి పదవిని అప్పజెప్పింది. కాగా.. సింధియా 30 ఏళ్ల కిందట తన తండ్రి మాధవరావు సింధియా నిర్వహించిన శాఖ పౌర విమానయానాన్ని ఇప్పుడు చేపట్టడం గమనార్హం.
Also Read: