Mudra Job Cheating: ఎంతలా అంటే.. అంతా ఇంతా కాదు.. నిరుద్యోగులకు మ్యాట్నీ షో చూపించారు. ప్రభుత్వ ఉద్యోగమంటూ ఇంటర్వూలు నిర్వహించారు. సెలక్టయ్యారంటూ అపాయింట్ మెంట్, ఆర్డర్స్ ఇచ్చారు. తీర ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన వారి నుంచి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలు లాగేశారు. రెండు సంవత్సరాలు కూడా సరిగ్గా నడవక ముందే చేతులెత్తేశారు. డిపాజిట్ల కింద తీసుకున్న డబ్బులు చెల్లించండని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరకు ఆఫీసునే మూసేశారు.
ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో మూడు సంవత్సరాల క్రితం పెద్ద హంగామా జరిగింది. రూ.10 వేల నుంచి రూ.50 వేల రూపాయల వరకు అవసరం ఉన్న వారికి రుణాలిస్తామంటూ ప్రకటించింది. రెండన్నర శాతం వడ్డీ వసూలు చేస్తామని బ్యాంక్ దుకాణం తెరిచారు. అందుకోసం ప్రతి మండలంలో ఒక బ్రాంచీని ఓపెన్ చేశారు. ఉద్యోగాల కోసం అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చారు. అంతే కుప్పులు తెప్పలుగా వచ్చిపడ్డ దరఖాస్తుల నుంచి కొంత మందిని ఉద్యోగులుగా చేర్చుకున్నారు. ఆకర్షనీయమైన జీతం, అలవెన్సులతో పాటు కమీషన్ కూడా ఇస్తామని ఆశచూపారు. త్వరలోనే కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా అప్‌గ్రేడ్ అవుతుందంటూ బిల్డప్ ఇచ్చారు.
ఇక్కడే షాకింగ్ న్యూస్.. ఇంకేముందు.. ఈ ఉద్యోగంలో మీరు చేరాలంటే ఒక్క కండీషన్. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు రిటర్న్ చేస్తాము.. అందుకు వడ్డీ కూడా ఇస్తామంటూ మభ్యపెట్టారు. రెండు సంవత్సరాల వరకు ఆ డబ్బు సంస్థ వద్దనే ఉంటుందని.. రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి అసలు కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కానీ రెండు సంవత్సరాలు గడవక ముందే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాంచీలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచీలను ఎత్తి వేశారు. సంస్థ నష్టాల్లో ఉందంటూ చేతులెత్తేశారు. దీంతో అందులో ఉన్న ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో కలుపుకొని రెండు వేలకు పైగా ఉద్యోగులున్నారు. వారందరి నుంచి డిపాజిట్ పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేశారు.
ఉద్యోగులు, స్థానికులు చేసిన డిపాజిట్స్‌తోనే రెండేళ్లు వ్యాపారం చేశారు. ఆ తర్వాత మావల్ల కావడం లేదంటూ బిచాణ ఎత్తేశారు. ఇప్పుడు బాధితులు ఎక్కడ చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. డిపాజిట్ చేసిన నిరుద్యోగులు, రైతులు మాత్రం ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. ఏం లాభం.. వాళ్లు కూడా మాకేం తెలియదు.. ఏం చయ్యలేమంటూ చేతులెత్తేస్తున్నారు. నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు దండుకొని మోసం చేసిన ముద్ర సంస్థపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. సేవా ముసుగులో చేసిన ఈ భాగంతో ఇంతా.. అంతా కాదు.. వందల కోట్లలో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ స్కామ్ జరిగిందా? లేక దేశ వ్యాప్తంగా ఈ పేరుతో వ్యాపారం చేశారా? చేస్తే దీని అసలు మోసగాళ్లు ఎవరు? ఎక్కడున్నారు? దీనిపై విచారణ జరిపేది ఎవరు? ఈ బాధితులకు న్యాయం చేసేది ఎవరు? ఫైనల్‌గా మాత్రం ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు, డిపాజిట్స్ పేరుతో మోసాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.