పిల్లల ప్రాణాలు తీసే హక్కు పెద్దలకు ఎవరిచ్చారు. ఎన్ని సమస్యలు ఉన్నా ముక్కుపచ్చలారని కన్న బిడ్డల్ని అత్యంత క్రూరంగా ఎలా చంపేస్తారు. ప్రస్తుతం జరుగుతోన్న ఇటువంటి ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో అలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నర్మెట్ట మండలం భీక్యా తండాకు చెందిన బానోత్ రమ ఇంట్లోనే తన ఇద్దరి పిల్లలు భానుశ్రీ (4), వరుణ్ (3)ల గొంతు కోసింది. ఆ తర్వాత ఆమె కూడా గొంతు కోసుకుంది. కొన ఊపిరితో ఉన్న రమను స్థానికులు జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో జరుగుతున్న గొడవలే ఈ ఘటనకు కారణమని ఆమె భర్త గోపాల్ తెలిపాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.