ఫోన్‌కాల్స్‌తో వేధింపులకు పాల్పడుతున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని తల్లి కూతురు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భర్త చనిపోవడంతో ధనలక్ష్మీ అనే మహిళ ఆమె తల్లి వద్ద ఉంటోంది. గత వారం ధనలక్ష్మీకి పెరియసామి(46) అనే వ్యక్తి కాల్ చేశాడు. రాంగ్‌నంబర్ అని చెప్పిన ఆమె ఫోన్ పెట్టేశారు. అప్పటి నుంచి పెరియసామి ఆ మహిళకు తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన ధనలక్ష్మీ ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వాళ్లు పెరియసామిని తమ ఇంటికి ఆహ్వానించారు.
మంగళవారం మధ్యాహ్నాం పెరియసామి ధనలక్ష్మీ ఇంటికి వచ్చాడు. దీంతో ఆతనితో ధనలక్ష్మీ, ఆమె తల్లి వాగ్వాదానికి దిగారు. అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి వేధిస్తున్నందుకు గట్టిగానే మందలించారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా చితకబాదారు. కాళ్లు, ముఖంపై బలమైన గాయాలవ్వడంతో ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్న పెరియసామి మృతిచెందారు. అనంతరం మృతదేహాన్ని ధనలక్ష్మీ ఆమె తల్లి వాళ్ల ఇంటి సమీపంలోని రైలు పట్టాలపై పడేశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.