AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో చెప్పినా ముద్దు పెట్టుకున్నందుకు.. 7 నెలలు జైలు శిక్ష!

బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి నేరాలకు పాల్పడితే విదేశాల్లో బహిరంగ ఉరిశిక్షలు, యావజ్జీవ శిక్షలు వేశారని తరచూ వింటూనే ఉంటాం. తాజాగా ఓ భారతీయుడు కామంతో చేసిన ఒక చేష్ట..

నో చెప్పినా ముద్దు పెట్టుకున్నందుకు.. 7 నెలలు జైలు శిక్ష!
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 21, 2020 | 9:54 PM

Share

Indian-Origin Man Jailed For 7 Months: విదేశీ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి నేరాలకు పాల్పడితే విదేశాల్లో బహిరంగ ఉరిశిక్షలు, యావజ్జీవ శిక్షలు వేశారని తరచూ వింటూనే ఉంటాం. తాజాగా ఓ భారతీయుడు కామంతో చేసిన ఒక చేష్ట.. అతడికి ఏడు నెలల జైలు శిక్ష పడేలా చేసింది. ఈ ఉదంతం సింగపూర్‌లో చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకుండా ఓ మైనర్ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు గానూ చెల్లం రాజేష్ కన్నన్(26) అనే భారతీయుడికి సింగపూర్ కోర్టు ఏడు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..

గతేడాది సోషల్ మీడియా ద్వారా చెల్లం రాజేష్ కన్నన్(26) అనే వ్యక్తికి పదిహేనేళ్ల బాలిక పరిచమైంది. అప్పటికే రాజేష్‌కు పెళ్ళై ఓ కుమార్తె కూడా ఉంది. కొన్నిరోజులు ఇద్దరూ మెసేజ్‌లు పంపించుకున్నారు. ఇక గత సంవత్సరం ఆగష్టు‌లో రాజేష్ మొదటిసారి ఆ బాలికను కలిశాడు. ఆ తర్వాత మరోసారి కలిసేందుకు ఆ బాలిక ఒప్పుకుంది. అయితే కలవడానికి మూడు రోజులు ముందు తన స్నేహితులకు మద్యం సీసాలు తీసుకు రమ్మని ఆ బాలిక రాజేష్‌ను కోరింది. మద్యం సీసాలు ఇచ్చే క్రమంలో రాజేష్ ఆమెను ముద్దు పెట్టుకోవాలని కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. అయినా కూడా వినని రాజేష్ ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడమే కాకుండా మద్యం సీసాలు తీసుకొచ్చినందుకు గానూ తనతో లైంగిక చర్యకు సహకరించాలని బలవంతం చేశాడంటూ ఆ మైనర్ బాలిక అతడిపై కేసు పెట్టింది. దీనితో రాజేష్ పరువు పోవడమే కాదు.. ఉద్యోగం పోయింది. భార్య అతడ్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఒక్క కేసుతో అతడి జీవితం దారుణమైన పరిస్థితికి చేరుకుంది.

అతడి కేసు కోర్టులో విచారణకు వచ్చింది. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానంటూ రాజేష్ పశ్చాత్తాపపడ్డాడు. గత మూడేళ్లుగా సింగపూర్‌లో ఉంటున్నానని.. మరెలాంటి నేరాలకు పాల్పడలేదని వాపోయాడు. ఈ కేసుతో చాలా కోల్పోయానని కోర్టు ఎదుట పేర్కొన్నాడు. అతడి వాదనలు విన్న న్యాయమూర్తి బాధితురాలిని బలవంతం చేసినందుకు గానూ రాజేష్‌కు 7 నెలల జైలు శిక్షను విధించాడు.