ప్రభుత్వాసుపత్రిలో శవాలను వదలని లంచావతారం..

అక్రమార్కులు, లంచావతారుల పట్ల ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ధనార్జనే ధ్యేయంగా కొందరు యద్దేచ్ఛగా లంచాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో లంచావతారాలు ఆఖరికి శవాలను కూడా వదిలిపెట్టడం లేదు.

ప్రభుత్వాసుపత్రిలో శవాలను వదలని లంచావతారం..

Updated on: Aug 25, 2020 | 7:04 PM

అక్రమార్కులు, లంచావతారుల పట్ల ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ధనార్జనే ధ్యేయంగా కొందరు యద్దేచ్ఛగా లంచాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో లంచావతారాలు ఆఖరికి శవాలను కూడా వదిలిపెట్టడం లేదు. తమవాళ్లు పోయి పుట్టెడు దుఖఃంలో ఉన్న వారిని సైతం రాబందుల్లా పొడుచుకుతింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

కుసుమలలిత అనే మహిళను భర్త దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ మార్చురీ వద్దే మృతురాలి తల్లి కళ్లు తిరిగి పడిపోయింది. ఆ మృతదేహాన్ని అప్పగించాలంటే 6వేలు ఇవ్వాలని ఆసుపత్రి మార్చురీలో పనిచేసే ఉద్యోగి డిమాండ్‌ చేశాడు. తాము పేదోళ్లమని ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. చివరకు రూ. 1500లకు బేరం కుదుర్చుకున్నాడు. అంతేకాదు మృతురాలి బంధువులతో వాదనకు దిగాడు. ప్రభుత్వాసుపత్రిలో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే… పోస్టుమార్టం ప్రైవేట్‌గా చేస్తామని ఎదురు వాదనకు దిగాడు. బాధితులకు కడుపుమండి ఆ లంచావతారం వ్యవహారమంతా వీడియో తీశారు. కూతురు చనిపోయిందన్న బాధలో ఉంటే ఇలాంటి లంచావతారాలు రాబందుల్లా పొడుకుచుతింటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దహనసంస్కారాలే జరిపించలేని పరిస్థితుల్లో ఉంటే వేలకు వేలు లంచాలు ఎలా ఇవ్వగలమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి లంచావతారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.