Hyderabad: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వైద్యుడు హైదరాబాదులోని ఓ హోటల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన డా.ఆర్.చంద్రశేఖర్ మెదక్ లో అనురాధ నర్సింగ్ హోమ్ పేరుతో ఆసుపత్రిని ఏర్పాటు చేసి తన భార్య అనురాధతో కలిసి గత ఇరవై సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాడు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు శ్రీనివాస్ బంధువులు ఆరోపణలు చేశారు. ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండుకు తరలించారు.
కాగా, తాజాగా నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండటంతో చంద్రశేఖర్ తన భార్యతో కలిసి వచ్చాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన తరువాత అతని భార్య అత్యవసర ఆపరేషన్ నిమిత్తం, తిరిగి మెదక్ కి వెళ్ళగా.. చంద్రశేఖర్ కె.పీ.హెచ్.బీ కాలనీలోని సితార్ గ్రాండ్ హోటల్ లో రూం నెంబర్ 314లో బస చేసాడు. అయితే, సాయంత్రం సమయంలో అతని భార్య అతడికి ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. దాంతో ఆమె హోటల్ సిబ్బందికి ఫోన్ చేసి తన భర్త ఫోన్ ఆన్సర్ చేయడం లేదని తెలిపింది. హోటల్ సిబ్బంది తలుపులు తట్టినా అతను డోర్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది పక్క రూమ్ గదిలో నుండి చూడగా అతడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హోటల్ కు చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా చంద్రశేఖర్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆత్మహత్య కోసమని తాడు, నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడ్లు తనతో పాటు తీసుకుని వచ్చాడని, ఆత్మహత్యకు గల కారణాల పై దర్యాప్తు కొనసాగుతుందని కూకట్‌పల్లి ఏసిపి చంద్రశేఖర్ తెలిపారు.
Also read:
Maa Elections 2021: ‘మా’ లో పేలుతోన్న మాటల తూటాలు.. రసవత్తరంగా మారిన ఫైట్