సాధారణంగా న్యాయం చేసేందుకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఉన్నాయి. అయితే గిరిజన(Tribal Areas in AP) ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ గ్రామ పెద్దలదే పెత్తనం నడుస్తోంది. ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టా రాజ్యంగా తీర్పు అమలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఇలాంటి తీర్పులు తీవ్ర దుమారం రేపుతుంటాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం గ్రామపెద్దల నిర్వాకం ఓ మానసిక వికలాంగుడి ప్రాణం తీసింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. మృతుడు అతని సొంత కుటుంబసభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. పంచాయతీ పెద్దల హుకుం ను ధిక్కరించే ధైర్యం చేయలేని వారు.. కుటుంబ పెద్దను దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్వతీపురం(Parvathipuram) మన్యం జిల్లాలోని సీతంపేట మండలం రేగులగూడలో మే 27న ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన సవర గయా కుమార్తె పద్మను సవర సింగన్న కర్రతో కొట్టాడు. సింగన్నకు మతిస్థిమితం సరిగా లేదు. కూతుర్ని కొట్టడంతో గయా తీవ్ర ఆగ్రహంతో సింగన్నను కిందకు తోసేశాడు. దీంతో సింగన్న కోపంతో గయాపై పెద్ద కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో గయా అక్కడికక్కడే మృతి చెందాడు.
మరుసటి రోజు గయా కుమారులు, స్థానికులు సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించారు. దీంతో సింగన్న కుటుంబసభ్యులు గ్రామ పెద్దమనుషులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీలో గయా కుమారులు.. తమ తండ్రి ఎలా చనిపోయాడో సింగన్న కూడా అలాగే చావాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందర్నీ చంపేస్తామని బెదిరించారు. దీంతో పెద్దలందరూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తలకు తల అని తీర్పు చెప్పారు. అందర్ని చంపేస్తారేమోనన్న భయంతో సింగన్న కుటుంబసభ్యులు ఇందుకు అంగీకరించారు. ఈనెల 28న సింగన్నపై విష ప్రయోగం చేశారు. అయినా చనిపోకపోవడంతో ఉరేశారు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా కాల్చేశారు.
సింగన్న మృతి సాధారణ మరణంగా భావించినప్పటికీ.. గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా అసలు విషయం తెలుసుకున్నారు. ఈ ఘటనకపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండు రోజుల్లోనే మిస్టరీని ఛేదించామని స్థానిక డీఎస్పీ చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సింగన్న, గయా హత్యల ఘటనకు కారకులైన 16 మందిపై కేసులు నమోదు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి