Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ రాడ్స్ లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ పల్టీ కొట్టడంతో 13 మంది వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుల్దానాలోని తాడేగావ్ సమీపంలో వచ్చిన రోడ్డు మలుపే ఈ యాక్సిడెంట్‌కు కారణమని తెలుస్తోంది. ఆ సమయంలో ట్రక్ వేగంగా వెళ్తుండటంతో అదుపు చేయడం కష్టమైంది. దీంతో ట్రక్ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది.
అయితే, నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు పనుల కోసం ఈ ఐరన్ రాడ్స్‌తో పాటు కూలీలను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ట్రక్ మొత్తం ఐరన్‌లోడ్‌తో నింపేశారు. అయినా.. కూలీలను కూర్చొబెట్టారు. దాదాపు 15 మందికిపైగా కూలీలు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్ బోల్తా పడిన వెంటనే అందులోని ఐరన్ రాడ్ మొత్తం వాటిపైన కూర్చున్న వారిపై పడింది. దీంతో వారికి బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో ఇనుప చువ్వల కింద కూలీలు నలిగిపోయారు. వారంతా ఉపిరిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటీన స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో జోరుగా వర్షం కరుస్తోంది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చివరికి ప్రొక్లెయిన్ సహాయంతో లారీని పక్కకు తీసి.. ఐరన్ లోడ్ మొత్తాన్ని తొలగించారు. అప్పటికే 13 మంది చనిపోయారు.. తీవ్రగాయాలతో కొట్టిమిట్టాడుతున్న మరో ముగ్గురుని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.. పైగా ఐరన్‌లోడ్‌తో ట్రక్ మొత్తాన్ని నింపేసి..పైన కూలీలను కూర్చోబెట్టుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.