Pregnant Women Death: ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి.. వైద్యులు ఆమెకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం సిబ్బందితోసహా వైద్యులు.. దీపావళి సంబరాల్లో మునిగారు. గర్భిణికి ఇంజెక్షన్ ఇచ్చామన్న సంగతిని మరిచి.. ఆసుపత్రి బయటకు వెళ్లి అంతా పటాకులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి విషమించడంతో నిండు గర్భిణీ కన్నుమూసింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సాగర్ జిల్లాకు చెందిన మహిళ (26) పురుడు కోసం బుందేల్‌ఖండ్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి వెళ్లింది. ప్రసవానికి సమయం కావడంతో వైద్యులు ఆమెకు పురిటి నొప్పుల కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం వైద్యులు, సిబ్బంది ఆమెను లేబర్ రూమ్‌లోనే వదిలి ఆసుపత్రి బయట పటాకులు కాలుస్తూ నిల్చున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో నిండు గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది.
అనంతరం ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ స్థానిక మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. డాక్టర్‌కు షోకాజ్ నోటిసులు పంపారు. వీరితోపాటు మెటర్నిటీ వార్డులో పనిచేస్తున్న ఐదుగురు ట్రైనీ డాక్టర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కళాశాల ప్రతినిధి డాక్టర్ ఉమేష్ పటేల్ వెల్లడించారు.
కాగా.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య మృతిచెందిందని బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్ర మిశ్రా తెలిపారు. బాబుకు జన్మనిచ్చి మరణించిందని తన ఫిర్యాదులో తెలిపాడని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
Also Read: