హైదరాబాద్ శివార్లలో చిరుత సంచారం…అధికారుల హెచ్చరికలు

హైదరాబాద్ నగర శివారుల్లో మరోసారి చిరుత కలకలం రేపింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలంతరీ వద్ద చిరుత హల్ చల్ చేసింది.

హైదరాబాద్ శివార్లలో చిరుత సంచారం...అధికారుల హెచ్చరికలు

Updated on: Oct 10, 2020 | 2:02 PM

హైదరాబాద్ నగర శివారుల్లో మరోసారి చిరుత కలకలం రేపింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలంతరీ వద్ద చిరుత హల్ చల్ చేసింది. అర్థరాత్రి సమయంలో అక్కడ ఉన్న రెండు ఆవులపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో రెండు ఆవుల మెడల్ని పూర్తిగా తినేసింది. గత నెలరోజుల క్రితం చిరుత అదే స్థలంలో ఒక ఆవు పై దాడి చేసి వెళ్ళింది. దీంతో స్థానిక ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత పులి సంచారంపై స్థానికులంతా కలిసి అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. గత ఆగస్టులో కూడా రాజేంద్రనగర్‌లో చిరుత సంచరించింది. అప్పట్లో ఓ రైతు ఆవుదూడను చంపి తినేసింది. తాజాగా ఇప్పుడు మరోసారి చిరుత సంచారంతో జనం బయటకు రావలంటేనే భయపడిపోతున్నారు.