Crime News: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. పాఠాలు చెప్పడం మానేసి అభం శుభం తెలియని బాలికలను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. కరోనా సమయాన్ని ఆసరాగా చేసుకొని ఒక్కొక్కరిని పాఠశాలకు రప్పిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అరెస్ట్ అయి కటకటలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దొడ్డా సునీల్‌కుమార్ అనే వ్యక్తి లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు. గతేడాది కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడిన సమయంలో చదువు పేరిట కొందరు బాలికలను తరచూ పాఠశాలకు రప్పించేవాడు. అతడు తమపై లైంగికదాడికి పాల్పడినట్లు అయిదుగురు బాలికలు డిసెంబరు 14న తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్సై అంజయ్య మరుసటి రోజు పోక్సో కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. శుక్రవారం కొత్తగూడెం పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరపర్చగా న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ సంచలన తీర్పు వెల్లడించారు. నిందితుడు సునీల్‌కుమార్‌కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11 వేల జరిమానా విధించారు.