ఐస్‌క్రీమ్‌‌లో పాయిజన్ కలుపుకుని మహిళ ఆత్మహత్యయత్నం.. అనుకోకుండా తిన్న ఆమె కొడుకు, సోదరి మృతి..!

|

Feb 25, 2021 | 6:54 AM

తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించి, పొరబాటున తన ఐదేళ్ల కుమారుడిని, 19 ఏళ్ల సోదరిని చంపేసిందో మహిళ.

ఐస్‌క్రీమ్‌‌లో పాయిజన్ కలుపుకుని మహిళ ఆత్మహత్యయత్నం.. అనుకోకుండా తిన్న ఆమె కొడుకు, సోదరి మృతి..!
Follow us on

Woman kills Son, Sister : కేరళ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించి, పొరబాటున తన ఐదేళ్ల కుమారుడిని, 19 ఏళ్ల సోదరిని చంపేసిందో మహిళ. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని కన్హంగాడ్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎలుకల మందు తాగి చనిపోవాలని భావించింది. ఇందు కోసం ఫిబ్రవరి 11న, ఎలుకల మందు తెచ్చుకొని ఐస్‌క్రీమ్‌లో కలుపుకొని తాగింది. ఐస్‌క్రీమ్‌లను తినేసి, అసౌకర్యంగా భావించి ఆమె గదికి వెళ్ళింది..

అయితే, ఆ ఐస్‌క్రీమ్‌లో కొంత భాగాన్ని బయటే పెట్టి మర్చిపోయింది. అందులో విషం ఉందనే విషయం తెలియని ఆమె ఐదేళ్ల కుమారుడు, 19 ఏళ్ల సోదరి అనుకోకుండా ఐస్‌క్రీమ్ తినేశారు.ఆ తరువాత వారు రెస్టారెంట్ నుండి కొంత బిర్యానీని కూడా తెప్పించుకుని తినేశారు. ఆ తరువాత చిన్న పిల్లవాడికి వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉండగా, కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఫిబ్రవరి 12 ఉదయం ఐదేళ్ల బాలుడు మరణించాడు. అలాగే మహిళ సోదరి కూడా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఒక వారం పాటు ప్రాణాలతో పోరాడిన తరువాత, ఆ యువతి కూడా ఫిబ్రవరి 24, బుధవారం ఉదయం మరణించింది. ఈ ఘటనలో వాళ్లిద్దరూ మరణించారు.

ఇదిలావుంటే, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ఆ మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి చావుకు కారణమై, తానూ ఆత్మహత్యకు పాల్పడినందుకు సదరు మహిళపై కేసు నమోదైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫిబ్రవరి 17 న కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి కారణమైన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also…  Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్ల నుంచి బయటపడే చక్కటి మార్గాలు