తీగలాగితే డొంకంతా కదులుతోంది. కార్వీ స్కామ్‌లో తవ్వేకొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా కస్టమర్ల షేర్లను తాకట్టు పెట్టి కోట్లు కొల్లగొట్టేశారు. రూ.2 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. మరి డబ్బంతా ఏం చేశారు? ఎక్కడికి మళ్లించారు? ఈ నిజాలన్నీ రాబట్టేందుకే ఛైర్మన్ పార్ధసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ కేసులో దూకుడు పెంచారు సీసీఎస్ పోలీసులు. ఈ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీకి లేఖరాశారు.హవాలాతో పాటు మనీలాండరింగ్ కూడా జరిగినట్టు పేర్కొన్నారు. కస్టమర్ల షేర్లను తాకట్టుపెట్టి దాదాపు రూ. 2,100 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్మునంతా వ్యక్తిగత కంపెనీలకు మళ్లించినట్టు నిర్ధారించారు పోలీసులు. రియాల్టీ, ఇన్ఫోటెక్ కంపెనీల్లో డబ్బుల్ని పెట్టారు. అయితే ప్రస్తుం ఆ రెండు కంపెనీల్లోనూ నిధులు లేవని తేల్చారు . ఈ నిధుల మళ్లింపు, ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీకి లేఖ రాశారు సీసీఎస్ అధికారులు…
అటు ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ అదుపులోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకొని నాంపల్లిలోని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి 137 కోట్ల రుణం తీసుకొని మోసం చేశారనే ఆరోపణలపై పార్థసారథిపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగానే ఆయన్ను ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో మరికొన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడిదారుల డీమాట్ అకౌంట్లను తనఖా పెట్టి బ్యాంకులో ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకున్నారు. ఈ కేసులో కార్వీ సంస్థ మిగతా డైరెక్టర్ల పాత్ర ఏంటి? కస్టమర్ల షేర్లను ఎందుకు తనఖా పెట్టారు.. ఆ సొమ్మంతా ఏం చేశారు. ఈ అంశాలన్నింటిపై పార్థసారథిని ప్రశ్నించనున్నారు పోలీసులు. కార్వీ స్కామ్ విలువ దాదాపు 3 వేల కోట్లకుపై మాటే అని భావిస్తున్నారు. అటు హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పార్ధసారథి తీసుకున్న రుణాలు లెక్కలూ తేలాల్సి ఉంది.