తన ప్రాణాలకు ప్రాణమైన భార్య, ఇద్దరు పిల్లలు ఆచూకీ కనిపించకుండాపోయినట్లు ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కనిపించకుండా పోయిన వారు ఎక్కడున్నారో ట్రేస్ చేశారు. అయితే చివర్లలో ఈ కేసుకు సంబంధించి నిజానిజాలు తెలుసుకున్న పోలీసులు షాక్‌కు గురైయ్యారు. కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకన్న ఘటన ఇది. అశోక్ నగర్‌లోని ఓ బాడుగ ఇంటిలో నాగరాజ్, రేణుక, ఇద్దరు పిల్లలు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. ఈ నెల 18న రేణుక, తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండాపోయింది. నాగరాజ్ తన స్వస్థలానికి ఏదో పనిమీద వెళ్లి.. ఇంటికి తిరిగొచ్చాక వారు కనిపించలేదు. చుట్టు పక్కల ప్రాంతాల్లో వారి కోసం వెతికిచూసినా ఫలితం లేకపోయింది. దీంతో తన భార్య, ఇద్దరు పిల్లలను వెతికిపెట్టాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు… రేణుక(30), ఇద్దరు పిల్లల ఆచూకీని గుర్తించారు. అయితే దర్యాప్తులో పోలీసులకు దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి. వార్తవానికి నాగరాజ్ రేణుక భర్త కాదని తెలిసింది. రేణుక భర్త కొంతకాలం క్రితం మరణించాడు. దీంతో ఆమె, నాగరాజ్‌తో సహజీవనం చేస్తోంది. ఓ ఇంటిని బాడుగకు తీసుకుని నాగరాజ్, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవనం సాగిస్తోంది.
కొంతకాలంగా రేణుకను నాగరాజ్ చీటికీమాటికీ దూషించడం, చేయి చేసుకుంటూ వేధిస్తున్నాడు. దీంతో నాగరాజ్ పట్ల ఆమెకు విరక్తి ఏర్పడింది. ఇక కలిసి జీవించలేమని భావించి.. ఆయన ఇంట్లో లేని సమయంలో ఆమె తన స్వస్థలానికి వెళ్లిపోయినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి చేసుకోకుండా తాము సహజీవనం చేస్తున్నట్లు నాగరాజ్ కూడా పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే రేణుకతో కలిసి జీవిస్తానని.. ఆమె కాపురానికి వచ్చేలా ఒప్పించాలని కోరాడు.
నాగరాజ్ వేధింపులు భరించలేనంటున్న ఆమె.. ఆతనితో కలిసి ఒక్క రోజు కూడా జీవించలేనని పోలీసులకు తెగేసి చెప్పేసింది. ఏదైనా పని చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను తానే పోషించుకుంటానని చెబుతోంది. ఇద్దరి మధ్య విభేదాల నెలకొన్నందున విడివిడిగా జీవించాలని పోలీసులు వారికి సూచించారు. ఇద్దరి మధ్య వివాహం జరగనందున రేణుకను కాపురానికి రావాలని ఒత్తిడి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగరాజ్‌ను పోలీసులు హెచ్చరించారు.
Also Read..
Arjun Tanks: శత్రు దేశాల గుండెల్లో దడ మొదలైనట్టే.. రక్షణ శాఖ అమ్ములపొదిలోకి అత్యాధునిక అస్త్రం