Jammu Kashmir terrorist attack: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఘాతుకానికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీనిపై సీరియస్‌గా ఉన్నారు పోలీసులు. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కశ్మీర్ డీజీపీ. జమ్ముకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. శ్రీనగర్ శివార్లలోని పంతా చౌక్ జెవాన్ప్రాంతంలో పోలీసుల బస్సుపై కాల్పులు జరిపారు ముష్కరులు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. దాడి సమాచారంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. అదనపు బలగాల్ని రంగంలోకి దింపి, ఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన ముష్కరుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు అధికారులు.
పోలీసుల స్పెషల్ కాన్వాయ్‌ను టార్గెట్ చేశారు టెర్రరిస్టులు. మోటర్‌బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు, ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడిందో ఇంకా క్లారిటీ కాలేదు. కానీ, దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించింది కశ్మీర్ టైగర్స్ సంస్థ. అటు ఈ దాడిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కశ్మీర్ డీజీపీ దిల్బాగ్‌సింగ్. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు డీజీపీ. అయితే మొన్న పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాది హతమైన తరువాత, ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో పోలీసుల బస్సు దెబ్బతింది. అటు ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు పంతా చౌక్జెవాన్ప్రాంత ప్రజలు. భారీగా పోలీసులు మోహరించడంతో టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.
కాగా, ఈ ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై వివరాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. దాడిలో అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబాలకు కూడా ఆయన సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
PM @narendramodi has sought details on the terror attack in Jammu and Kashmir. He has also expressed condolences to the families of those security personnel who have been martyred in the attack.
— PMO India (@PMOIndia) December 13, 2021